కరీంనగర్ కార్పొరేషన్: నగర అభివృద్ధిలో డబ్బులు రాష్ట్రానివైతే డబ్బా బీజేపీదని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. నగరంలో అభివృద్ధి పనులు కేంద్ర నిధులతోనే జరుగుతున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పుకోవడం విడ్డూరమన్నారు. శనివారం నగరంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ యూఐడీఎఫ్, యూసీఎఫ్, స్మార్ట్‌సిటీ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటానే అధికమన్నారు. యూఐడీఎఫ్ రూ.50 కోట్ల నిధులు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రుణం ద్వారా ఇస్తున్నవని, ఆ రుణం చెల్లించేంది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. కేంద్రం వాటా రూపాయి కూడా లేదన్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ రూ.840 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.210 కోట్లు ఇవ్వగా, హడ్కో రుణం రూ.420 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. రూ.840 కోట్లలో రూ.630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంటే, కేంద్రం రూ.210 కోట్లు ఇస్తోందన్నారు. బీజేపీ నాయకులు కేంద్రమే రూ.840 కోట్లు ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకొంటున్నారన్నారు. స్మార్ట్‌సిటీ బ్యాలెన్స్ రూ.140 కోట్లలో, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.70 కోట్లు జమ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.70 కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపిందన్నారు. యూఐడీఎఫ్ మార్గదర్శకాల ప్రతిని బండి సంజయ్ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు.


