రైల్వే ఆలస్యపు శోకం!
పుష్కరమైనా పూర్తయ్యేనా?
ఇప్పట్లో పూర్తికాని కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు
2029లోనే హైదరాబాద్ రైలు అందుబాటులోకి
మానేరు నదిలో మొదలైన వంతెన నిర్మాణ పనులు
గోపాల్‌రావుపల్లి నుంచి అనుపురం వరకు 2 కిలోమీటర్ల బ్రిడ్జి
సిరిసిల్లలో 831 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం
కొత్తపల్లిలో మరో మూడు గుంటల భూమి సేకరణ
పదేళ్లు అయిపాయె
గోపాల్‌రావుపల్లి.. అనుపురం మధ్య ప్రారంభమైన
రైల్వే వంతెన పనులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు హైదరాబాద్‌కు రైల్వే ద్వారా రాకపోకలు సాగించేందుకు కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు పనులు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 7న అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు. హైదరాబాద్– మనోహరాబాద్– సిద్దిపేట– సిరిసిల్ల– వేములవాడల మీదుగా కరీంనగర్ చేరుకునేలా రూటు డిజైన్ చేశారు. భూసేకరణ, పరిహారం, బడ్జెట్ కేటాయింపుల్లో సమస్యలతో ప్రాజెక్టు రోజురోజుకు జాప్యమవుతోంది. రాజధాని హైదరాబాద్– పాత కరీంనగర్ జిల్లాకు కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు పెద్దపీట వేశారు. తొలి ఐదేళ్లు వచ్చే నష్టాలను భరించేందుకు కేంద్రాన్ని ఒప్పించి మరీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 17 స్టేషన్లతో 151 కిలోమీటర్ల దూరం మేర విస్తరించిన ఈ ప్రాజెక్టుకు ఆరంభ వ్యయం రూ.1,167 కోట్లు కావడం గమనార్హం.
కొత్తపల్లిలో
3 గుంటలు సేకరణ
కొత్తపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఇటీవల ఓ ఆశ్చర్యమైన ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ సమీపంలో నిర్మించిన సీసీ రోడ్డు కోసం రైల్వేకు అప్పగించేందుకు కరీంనగర్ రెవెన్యూ అధికారులు భూసేకరణ జరిపి భూమి అప్పగించారు. ఇటీవల తాము అప్పగించిన భూమి కన్నా మూడు గుంటల భూమి అధికంగా రైల్వే కోసం వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారికి పరిహారం ఇవ్వాలని పాత ఆర్డీవో మహేశ్వర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆ మూడు గుంటల భూమి కోసం నిబంధనల ప్రకారం.. ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే మొత్తం 3 గుంటల భూమికి మార్కెట్ రేటు ప్రకారం.. పరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
పెరగనున్న కనెక్టివిటీ
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లావాసులకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాజధాని నుంచి భక్తులు పెరుగుతారు. కొత్తపల్లి– మనోహరాబాద్ హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. భవిష్యత్తులో ఉత్తరతెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్లకు కీలకమైన రూట్‌గా మరింత ప్రాధాన్యం దక్కించుకోనుంది. సిరిసిల్ల, సిద్ధిపేట, జగిత్యాల జిల్లాలకు పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను ఇటు హైదరాబాద్ అటు, మహరాష్ట్ర వైపు తరలింపు సులభతరంగా మారుతుంది. కొండగట్టు పరిసరాల్లోని రేర్ ఎర్త్ మెటల్స్ గనుల తవ్వకం మొదలై, ఎగుమతులనాటికి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


