రూ.125 కోట్లలో రూ.77 కోట్లు ఖజానాకు
విగతా రూ.48 కోట్లపై అధికారుల దృష్టి
శుక్రవారంతో ముగిసిన గడువు
డిఫాల్టర్లపై కేసులకు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి న టెండర్ ధాన్యం బకాయిల వసూళ్లలో ప్రభుత్వం వేగం పెంచింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు, ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలు, వరుసగా గడువు విధించడం వంటి చర్యలతో జిల్లాలో బకాయిల చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. జిల్లాలో మొత్తం రూ.125 కోట్ల మేర బకాయిలు ఉండగా, ప్రభుత్వం నిర్దేశించిన శుక్రవారం గడువు ముగిసే నాటికి రూ.77.01 కోట్లు ప్రభుత్వ ఖాతా లో జమయ్యాయి. ఇంకా దాదాపు రూ.48 కోట్ల మేర బకాయిలు మిగిలి ఉండటంతో వసూళ్లపై అధి కారులు దృష్టి సారించారు. ఇప్పటికే పలుమా ర్లు గడువు ఇచ్చినప్పటికీ కొందరు మిల్లర్లు బకాయిలు చెల్లించకపోవడంతో నోటీసులు ఇచ్చి కేసులు న మోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రూ.77 కోట్లు వసూలు
జిల్లాలో రూ.125 కోట్ల బకాయిలు పేరుకుపోగా ప్రభుత్వం ఇచ్చిన గడువు (శుక్రవారం వరకు) లోపు రూ.77 కోట్లు వసూలయ్యాయి. మరో రూ.48కోట్లు పెండింగ్‌లో ఉంది. ఇందులో అత్యధికంగా ఒకే యాజమాన్యానికి సంబంధించిన మానకొండూరులోని వీరభద్ర ఇండస్ట్రీస్, సిద్ది వినాయక ఇండస్ట్రీస్, తిమ్మాపూర్ మండలం రేణికుంటలోని ఆర్‌కే ఇండస్ట్రీస్, సాయిశ్రీనివాస్ ఇండస్ట్రీస్ నుంచి రూ.35 కోట్లు దఫాలవారీగా పూర్తిగా చెల్లించడం విశేషం. అలాగే తిమ్మాపూర్‌లోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్, మానకొండూరులోని మానస, హనుమాన్ ఇండస్ట్రీస్ నుంచి బకాయిలు వసూలయ్యాయి.
కొన్ని మిల్లుల్లో భారీ బకాయిలు
జమ్మికుంట, హుజురాబాద్‌కు చెందిన చాలా మిల్లుల నుంచి బకాయిలు వసూలు కావాల్సి ఉంది. జమ్మికుంట మండలం కోరపల్లిలోని మహాశక్తి ఇండస్ట్రీస్ నుంచి 12,277 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.27 కోట్లు, ఇల్లందకుంట మండలం శ్రీసీతారామ ఇండస్ట్రీస్‌కు సంబంధించి 16,807 మెట్రిక్ టన్నులకు రూ.37 కోట్లు వసూలు కావాల్సి ఉంది. చొప్పదండిలోని శ్రీశ్వేత ఇండస్ట్రీస్, హుజూరాబాద్ లోని వరుణ్ ఇండస్ట్రీస్, శ్రీనిధి ట్రేడర్స్, సాయిట్రేడర్స్(జగన్మాత)తోపాటు తదితర మిల్లుల్లో ఒక్కో మిల్లు రూ.5 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. వీరందరిని డీఫాల్టర్లుగా గుర్తించి కేసులు నమోదు చేసి ఆర్‌ఆర్ యాక్ట్ కింద రికవరీకి ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని మిల్లర్ల నుంచి 25 శాతం అదనంగా వసూలు చేయనున్నారు.
డిఫాల్టర్లపై చట్టపరమైన చర్యలు
బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన తుది గడువు శుక్రవారంతో ముగియడంతో ఇకపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చెల్లింపులు చేయని మిల్లర్లను డీఫాల్టర్లుగా గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత మిల్లులకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్‌ఆర్ యాక్ట్ కింద ఆస్తుల జప్తు, రికవరీ చర్యలకు సిద్ధమవుతున్నారు.


