సైదాపూర్/చిగురుమామిడి: దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో పర్యటించారు. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి శివారులో రూ.1.56కోట్లతో నిర్మించనున్న వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సైదాపూర్ న్యాల చెరువు కట్టపై వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. వెన్కెపల్లిలో మండల కార్యాలయాల సముదాయం వద్ద రూ.30 లక్షలతో నిర్మించే ఆహార ఉత్పత్తుల గిడ్డంగి పనులకు శంకుస్థాపన చేశారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో రూ.30లక్షలతో వెటర్నరీ సబ్ సెంటర్, రూ.16లక్షలతో నిర్మించే వీవో మహిళా సంఘ భవన నిర్మాణానికి, చిగురుమామిడిలో రూ.20 లక్షలతో నిర్మించే ప్రాథమిక పశువైద్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు గత పాలకులు వ్యవసాయం దండగ, వరి వేసుకుంటే ఉరేనన్నారని, నేడు వ్యవసాయం పండగ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనలో నిరూపితమవుతోందన్నారు. జలసిరి కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. ఐదెకరాల భూమి ఉన్న రైతు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. కలెక్టర్ చిత్రామిశ్రా, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, చాడ కొండాల్‌రెడ్డి, హుస్నాబాద్ ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆర్డీవో షర్మిల పాల్గొన్నారు.


