● గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యం తాగొద్దని కుటుంబసభ్యులు చెప్పడంతో మనస్థాపం చెందిన వ్యక్తి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తంగళ్లపల్లి మండలంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన అట్టె మల్లేశం(55) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లేశం గత నెల 30వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగాడు. ఈవిషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి పెద్ద కుమారుడు అట్టె చంద్రశేఖర్ ఫిర్యాదుతో ఎస్సై ఉపేంద్రచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓసీపీ–2లో బోజర్ బోల్తా.. కార్మికులకు గాయాలు
రామగిరి: సింగరేణి ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–2లో గురువారం డీజిల్ బోజర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు కార్మికులు గాయాలపాలయ్యారు. ఓసీపీ–2లోని పాత పార్కింగ్ ప్రాంతం నుంచి కింద ఉన్న క్వారీలోకి వెళ్లే మార్గంలో బోజర్ అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న బొగరి సుధీర్‌కు తీవ్రగాయాలు కాగా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు కార్మికులు తెలిపారు.
రోడ్డుప్రమాదంలో మహిళ దుర్మరణం
ధర్మారం: ధర్మారం మండల కేంద్ర శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గోపాల్‌రావుపేటకు చెందిన రంగు రాజమ్మ (60) మృతిచెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజమ్మ గోపాల్‌రావుపేటకు వెళ్లేందుకు ధర్మారం బస్టాండ్ వద్ద వేచి ఉంది. అంతలోనే అదే గ్రామానికి చెందిన సిరిపురం స్వామి మోటార్ సైకిల్‌పై రాగా, అతడి వాహనంపై రాజమ్మ గోపాల్‌రావుపేటకు వెళ్తుండగా వెనుక నుంచి మరో బైకు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో కిందపడిన రాజమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని గ్రామస్తులు తెలిపారు.
ఆర్మేనియాలో చిక్కుకున్న మల్యాల వాసి
● స్వదేశానికి రప్పించాలని ఎమ్మెల్యే సత్యంకు వినతి
మల్యాల: మల్యాల మండలకేంద్రానికి చెందిన నాంతాబాద్ గంగకిషన్ ఏజెంట్ చేతిలో మోసపోయి ఆర్మేనియా దేశంలో చిక్కుకుపోయాడు. సదరు ఏజెంట్ రష్యా పంపిస్తామని చెప్పి తనను ఆర్మేనియా పంపించాడని, తనవద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. పని లేకపోవడంతో అడుక్కుని తింటున్నానని కన్నీరుపెట్టుకుంటున్న వీడియో పంపించాడు. సీఎం రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించి తనను ఆదుకోవాలని, స్వదేశానికి రప్పించాలని వేడుకున్నాడు.
మైసమ్మ గుడి కూల్చివేత
● కిషన్‌రావుపల్లి గ్రామస్తులు ఆందోళన
కోరుట్ల: కోరుట్ల మండలం కిషన్‌రావుపల్లెలో మైసమ్మ గుడిని కొంతమంది రియల్టర్లు కూల్చివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గుడి కూల్చివేసిన చోట గురువారం ధర్నా చేసి టెంట్ వేసి నిరసన తెలిపారు. కూల్చివేసిన ఆలయానికి సంబంధించిన స్థలాన్ని వదిలేసి కొత్త ఆలయం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ కృష్ణచైతన్యకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించి గుడిని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
యువకుడి కిడ్నాప్.. కేసు నమోదు
కరీంనగర్‌క్రైం: ఓ యువకుడిని అపహరించి, చిత్రహింసలకు గురిచేసి, రూ.52వేలు వసూలు చేశారంటూ అందిన ఫిర్యాదుతో గురువారం కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు దర్యాప్తు జరుగుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. సప్తగిరికాలనీకి చెందిన బుద్దిరెడ్డి కమలాకర్ రాంపూర్‌లోని ఓ షోరూంలో పనిచేస్తున్నాడు. ఈనెల 4న తనకు పరిచయమున్న ప్రశాంత్ అలియాస్ శశి పనిఉందని కారులో తీసుకెళ్లాడు. మంకమ్మతోట వద్ద సెల్‌ఫోన్ లాక్కున్నాడు. తన ఇంటికి తీసుకెళ్లి అతని భార్యతో అక్రమసంబంధం ఉందని ఒప్పుకోవాలని ప్రశాంత్, అతని కుటుంబ సభ్యులు బంధించి తీవ్రంగా దాడిచేశారు. కారులో వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ జ్యోతినగర్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద తన బ్యాంకు కార్డుల ద్వారా రూ.52వేలు స్వైప్ చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అనంతరం సప్తగిరికాలనీ డంపింగ్ యార్డ్ సమీపంలో దింపి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి ప్రశాంత్ మద్యంమత్తులో కమలాకర్ ఇంటికి వెళ్లాడు. రెండు బైక్‌లు ధ్వంసం చేశాడు. కమలాకర్ భార్యను బెదిరించాడు. ఈ విషయమై బాధితుడు టూ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


