అవినీతి అంతస్తులు | - | Sakshi
Sakshi News home page

అవినీతి అంతస్తులు

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

అవినీతి అంతస్తులు ● నగరంలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలు ● బల్దియా ఆదాయానికి భారీగా గండి ● షరా మామూలుగానే పట్టణ ప్రణాళిక

నోటీసులు ఇచ్చాం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో అక్రమ నిర్మాణాలు భారీ గా పెరిగిపోతున్నాయి. అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టడం, తీసుకున్న అనుమతులు మీరి అంతస్తులు నిర్మించడం, ఆపై పెంట్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకోవడం సాధారణంగా మారింది. తద్వారా నగరపాలకసంస్థకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి ఏటా గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా పట్టణ ప్రణాళిక విభాగం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

యథేచ్ఛగా ఉల్లంఘనలు

వాణిజ్య భవనాలు, సముదాయాలు, అపార్ట్‌మెంట్లు.. ఏ నిర్మాణాలైనా నిబంధనలు ఉల్లంఘించడం నగరంలో సర్వసాధారణంగా మారింది. నగరం శరవేగంగా విస్తరిస్తుండడం, విద్య, వైద్య, వస్త్ర, తదితర వ్యాపారాలకు హబ్‌గా మారుతున్న క్రమంలో బహుళ అంతస్తులకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో యజమానులు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకొని భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, సంబంధిత అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను ‘మచ్చిక’ చేసుకొని నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకటి, రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని, ఆపై అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్న భవనాల సంఖ్య నగరంలో రోజురోజుకు పెరిగిపోతోంది.

వాటాలే ప్లానింగ్‌

ప్రతి సోమవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల్లో అగ్రభాగం టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించినవే. అక్రమ నిర్మాణాలు, సెట్‌ బ్యాక్‌ లేకుండా రోడ్లపైనే కట్టడాలపై ఫిర్యాదులు ప్రతి వారం వస్తున్నా, తీసుకున్న చర్యలు అంతంత మాత్రమే. రోడ్లు, వీధుల్లో ఇసుక, కంకర కనిపించగానే వాలిపోయే టౌన్‌ప్లానింగ్‌ కిందిస్థాయి సిబ్బంది, అధికారులకు అక్రమ నిర్మాణాలు కనిపించకపోవడం నమ్మశక్యంగా లేదు. ఆపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు ఉండడం లేదు. భవన యజమానులు, ప్రైవేట్‌ ఇంజనీర్ల ద్వారా ముడుతున్న ముడుపుల వాటాలు కిందినుంచి పైస్థాయి వరకు పంచుకొంటుండడంతోనే అక్రమ నిర్మాణాల బాగోతం నిరాటంకంగా సాగుతోందనే ప్రచారం బల్దియాలో ఉంది.

బల్దియా ఆదాయానికి గండి

అక్రమ నిర్మాణాలతో నగరపాలకసంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. బహుళ అంతస్తుల నిర్మాణాలకు లక్షల రూపాయలు నగరపాలకసంస్థకు చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రుసుం ఎగవేసేందుకు, ముడుపులతో మేనేజ్‌ చేస్తుండడంతో, ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని నగరపాలకసంస్థ కోల్పోతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాల వ్యవహారంపై దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సి ఉంది.

నగరంలోని గణేశ్‌నగర్‌ బైపాస్‌ రోడ్డులో నిర్మించిన

ఈ బహుళ అంతస్తుల భవనాన్ని చూశారు కదా.

ఈ భవన నిర్మాణ సమయంలో జీ ప్లస్‌ టు అంతస్తుకు మాత్రమే నగరపాలకసంస్థ నుంచి అనుమతి తీసుకున్నారు. అనుమతిని మీరి మరో రెండు అంతస్తులు కలిపి,మొత్తం నాలుగు అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. నగరపాలకసంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నా

చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

గణేశ్‌నగర్‌లో జీ ప్లస్‌ టూ అనుమతి తీసుకొని, అక్రమంగా మరో రెండు అంతస్తులు నిర్మించినట్లు గుర్తించాం. ఇప్పటికే ఆ భవన యజమానికి నోటీసు ఇచ్చాం. చర్యలు కూడా తీసుకొంటాం. ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పాల్గొంటున్నందున, ప్రక్రియ ముగిసిన తరువాత పూర్తిస్థాయిలో నగరంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడుతాం.

– బషీర్‌, డీసీపీ, నగరపాలకసంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement