కరీంనగర్: జిల్లా ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక క్రిటికల్ కేర్ యూనిట్ ఏడాది గడిచినా ప్ర జలకు అందుబాటులోకి రాలేదు. గతేడాది జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన ఈ భవనం సాధారణ వార్డులా మారింది. అత్యవసర వైద్య సేవలకు అవసరమైన సూపర్ స్పెషాలిటీ విభాగాలు, ప్రత్యేక వైద్యులు, ఆధునిక చికిత్సా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో నిరూపయోగంగా మారింది.
ఇతర జిల్లాల నుంచి బాధితులు
కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలతో పాటు మంచిర్యా ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రినే ఆశ్రయిస్తున్నారు. గుండెపోటు, మెదడులో రక్తస్రావం, తీవ్ర రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, తీవ్ర గాయాల వంటి అత్యవసర కేసులకు చికిత్స అందక హైదరాబాద్, వరంగల్‌కు తరలిస్తున్నారు. ‘గోల్డెన్ అవర్’లో అందాల్సిన వైద్యం ఆలస్యం కావడంతో ప్రాణనష్టం పెరుగుతోందని వైద్య వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అత్యాధునిక భవనం.. అరకొర సేవలు
కేంద్ర నిధులతో నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ కేంద్రంలో ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, మానిటరింగ్ వ్యవస్థలు, ఆపరేషన్ థియేటర్లు వంటి సదుపాయాలకు అనుగుణంగా భవనాన్ని సిద్ధంగా ఉంచారు. కార్డియాలజిస్టులు, న్యూరో ఫిజీషియన్లు, న్యూరో సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు, నెఫ్రాలజిస్టు, ట్రామా సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, ప్రత్యేక నర్సింగ్ సిబ్బంది నియామకం జరగలేదు. ఫలితంగా భవనం ఉన్నా, సేవలు సాధారణంగా మారాయి. క్రిటికల్ కేర్ ప్రారంభమై ఏడాది పూర్తయినా పూర్తిస్థాయి సేవలు అందడం లేదని ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘క్రిటికల్ కేర్ విభాగంలో అత్యవసర వైద్యం అందించే సూపర్‌స్పెషాలిటీలకు సంబంధించిన పరికరాలు సరఫరా జరుగుతున్నాయి. త్వరలో వైద్యుల నియామకం పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే క్రిటికల్‌కేర్‌లో వైద్యం అందిస్తున్నాం. పరికరాలు వచ్చి, వైద్యుల నియామకం జరిగితే రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందించగలుగుతాం’. అని సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి వివరించారు.


