రుద్రంగి(వేములవాడ): కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చిందని కార్మిక, ఉపాధి, శిక్షణ, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రుద్రంగి మండలకేంద్రంలో రూ.45 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏటీసీ సెంటర్, రూ.40 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మంగళవారం విప్ ఆది శ్రీనివాస్, డైరెక్టర్ ఉపాధి కల్పన అండ్ శిక్షణ శాఖ ఐఏఎస్ నిర్మల క్రాంతి వెస్లీ, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీతేతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ హయాంలో ఐటీఐలకు నిధులు మంజూరు చేయకుండా యువత ఉద్యోగ అవకాశాలను నాశనం చేశారన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం జర్మనీ బాష నేర్చుకుంటే కేటీఆర్ హేళనగ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పేదలు విదేశి భాష నేర్చుకొని అభివృద్ధి చెందడం కేటీఆర్‌కు ఇష్టం లేదన్నారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని విదేశీ భాషల శిక్షణ అందిస్తున్నామని, రుద్రంగికి జర్మన్ భాష శిక్షకుడిని పంపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విప్ ఆది మాట్లాడుతూ, మూడపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రుద్రంగి ఏటీసీలో 288 మంది విద్యార్థులు ఏడు కోర్సుల్లో శిక్షణ పొందే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఏటీసీల ద్వారా పరిశ్రమలకు ఉపయోగపడే శిక్షణ ఇస్తారని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ ముకుందరెడ్డి, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసాచారి, ఈఈ పీఆర్ సుదర్శన్‌రెడ్డి, మైనింగ్ ఏడీ క్రాంతి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నట్రాజ్, సర్పంచ్ గండి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వివేక్ వెంకట స్వామి


