విద్యార్థులను మింగిన నీటి గుంత
పాఠశాలకు మూడు రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా
వాష్‌రూమ్‌లలో నీటి కొరత
బహిర్భూమికని బయటకు వెళ్లిన విద్యార్థులు
అక్రమంగా మట్టి తరలింపుతో పెద్దపెద్ద గుంతలు
లోతు తెలియక నీటిలో మునిగిన చిన్నారులు
బోరుమన్న తల్లిదండ్రులు
మల్యాల: పిల్లలు బాగా చదువుకుని తమ కలలు నెరవేరుస్తారని భావించిన ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. ఊహ తెలియని వయసులో ఉన్న ఊరికి.. కన్నవాళ్లకు దూరంగా హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులను నీటిగుంత మింగింది. బహిర్భూమికని బయటకు వెళ్లి.. లోతు తెలియని గుంతలో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో నిత్యం సందడిగా ఉండే ఆ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది.
పాఠశాల విరామ సమయంలో..
మల్యాలలోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ.. ఒడ్డెరకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో జగిత్యాల రూరల్ మండలం టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం కృష్ణ, లక్ష్మి దంపతుల కుమారుడు సుశాంత్(10) నాలుగో తరగతి, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన వనం రాములు, రాధ దంపతుల కుమారుడు విష్ణు(11) ఐదో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే సోమవారం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సుశాంత్, విష్ణు బహిర్భూమకని బయటకు వెళ్లారు. పాఠశాల సమయం ముగిసినా తిరిగి రాకపోవడంతో అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న సుశాంత్ తమ్ముడు ఈశ్వర్ తన అన్న రాలేదని ఉపాధ్యాయుడికి తెలిపాడు. ఆయన వెంటనే సమీపంలో హాస్టల్‌కు వెళ్లి ఆరా తీయగా.. రాలేదని వార్డెన్ చెప్పాడు. పాఠశాలకు సుమారు 500మీటర్ల దూరంలో ఉన్న కొత్తకుంట చెరువు వద్దకు వెళ్లగా.. అక్కడి నీటిగుంతల వద్ద పిల్లల దుస్తులు, బూట్లు కనిపించాయి. వెంటనే పోలీసులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. సీఐ రాజ్‌కుమార్, ఎస్సై సందీప్, ఎంఈవో జయసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు విగతజీవులై జాలర్ల వలకు చిక్కారు.
పాఠశాలకు మూడు రోజులుగా నిలిచిన విద్యుత్..
పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. సోమవారం ఓ ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నాడు. పాఠశాలలో బాత్రూంలు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం ఉంది. ఇటీవలి వర్షాలకు పాఠశాలకు మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బాత్రూములకు నీటి సరఫరా నిలిచిపోయింది. రెండు రోజులుగా విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్తున్నారు.
అక్రమమట్టి తవ్వకాలతో గుంతలు..
భీమన్న గుట్ట సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో ఇటీవల వర్షాలకు నీరు చేరింది. బహిర్భూమికని బయటకు వెళ్లిన చిన్నారులు ఆ నీటిలో ఈత కొట్టేందుకు దిగి లోతు తెలియక మునిగిపోయినట్లు స్థానికులు, ఎంఈవో జయసింహారావు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణవార్త తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి
విద్యార్థుల మృతి తీవ్రంగా కలిచివేసిందని, ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒక ప్రకటనలో కోరారు.


