కరీంనగర్‌టౌన్/మల్లాపూర్: ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ ఉపకార వేతనాలకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం(ఎన్‌ఎంఎంఎస్‌ఎస్)2026–27 విద్యా సంవత్సరానికి ప్రకటన విడుదలైంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చురుకుదనం, తెలివితేటలు, చదువుపై మంచి పట్టు ఉన్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కారాదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ అమలు చేస్తోంది. గతంలో ఉపకార వేతనాలకు ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.6 వేల చొప్పున 9,10, ఇంటర్ రెండు సంవత్సరాల్లో కలిపి రూ. 24 వేలు అందించేది. ప్రస్తుతం రూ.12 వేలకు పెంచింది. అంటే నాలుగేళ్లకు కలిపి విద్యార్థులు రూ. 48 వేలు అందుకోనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 1న అర్హత పరీక్ష నిర్వహిస్తారు.
● అర్హతలు ఇవే..
2026–27 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్, మోడల్, ఎయిడెడ్ తదితర పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అర్హులు. ప్రైవేటు స్కూళ్లు, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో చదివేవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి. ఏడో తరగతిలో జనరల్, బీసీ కులానికి చెందినవారు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు. జనరల్, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాలి. http://scholarship.gov.in ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.
● నవంబర్ 1న రాతపరీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో విద్యార్థులకు ఈ ఏడాది నవంబర్ 1న ఆదివారం మూడుగంటల పాటు రెండు ప్రశ్నపత్రాల ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటి పరీక్ష, వెర్బల్, రీజనింగ్ నుంచి 90 ప్రశ్నలు (90 మార్కులు) ఇస్తారు. స్కాలస్టిక్ అప్టిట్యూడ్ పరీక్ష, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం విషయాలపై 90 ప్రశ్నలు (90 మార్కులు) ఇస్తారు. 7వ తరగతిలోని పూర్తి సిలబస్, 8వ తరగతిలోని సగం సిలబస్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. కనీస అర్హత మార్కులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం కటాఫ్‌గా నిర్ణయించారు. ఎంపిక సమయంలో రిజర్వేషన్ నిబంధనలు పాటిస్తారు.
సత్తా చాటితే ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం
ఈనెల 24 వరకు ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తు గడువు


