రైస్‌మిల్లుల్లో ఏటా వెలుగుచూస్తున్న అక్రమాలు మొక్కుబడి కేసులే తప్పా కఠినచర్యలేవి? మొద్దునిద్రలో విజిలెన్స్ అధికారులు
కరీంనగర్ అర్బన్: జిల్లాలో రైస్ మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ఇవ్వాల్సి ఉండగా లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని అమ్ముకుని రూ.వందల కోట్లు కూడబెడుతున్నారు. ఏటా ఈ దందా సాగుతుండగా అధికార యంత్రాంగం కేసులు నమోదు చేసినా, నోటీసులిచ్చినా ఎలాంటి జంకు లేకపోవడం ఇరువురి మధ్య సంబంధాలకు నిదర్శనం. గతంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు జమ్మికుంట మిల్లర్లపైనా కేసులు పెట్టగా, శంకరపట్నం మండలంలో ఒక మిల్లరును రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు నిగ్గు తేలుతుండగా అధికార యంత్రాంగ డొల్లతనాన్ని చాటుతోంది. కరీంనగర్‌కు చెందిన బడా వ్యాపారి దందాలో కీలకపాత్ర పోషిస్తుండగా, పీడీ యాక్ట్ నమోదైనా దందాను మరింత విస్తృతం చేశాడని వినికిడి.
సీఎంఆర్‌తో మిలర్ల వ్యాపారం
మిల్లు కట్టుకుంటే చాలు వ్యాపారం ప్రభుత్వమే ఇస్తుండటంతో ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వమిచ్చే ధాన్యాన్ని మరాడించి అక్రమ మా ర్గంలో అమ్ముకుని సదరు లోటును రేషన్ బియ్యంతో భర్తీ చేస్తున్నారు. ఆయా సీజన్లలో ఇచ్చిన సుమా రు 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు అందించారు. ఇందులో 40శాతానికి పైగా మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. గడువుల మీద గడువుల పొడిగించడంతో వీరి వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ‘వృద్ధులం, రోగగ్రస్తులం మాపై పీడీ యాక్ట్ పెట్టలేరు.. పెట్టేది 6ఏ కేసు.. దాంతో ఒరిగిదేం లేదు’ అని మిల్లర్లు బాహాటంగా చర్చిస్తుండటం వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతోంది.
విల్లాలు.. ఎకరాల కొద్ది భూములు
అక్రమాలకు రుచిమరిగిన మిల్లర్లు భారీగా ఆస్తులను కూడబెట్టారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో విల్లాలు, ఉమ్మడి జిల్లాలో ఎకరాల్లో భూములు కొనుగోలు చేశారు. ఓ వ్యాపారి ప్రభుత్వ ధాన్యం అమ్ముకుని రూ.200ల కోట్లకు పైగా కూడబెట్టారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో స్పష్టమవుతోంది.
లక్షల క్వింటాళ్లు ధాన్యం.. రూ.కోట్లు పక్కదారి
జిల్లాలో జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్, సదాశివపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్ రూర ల్ చుట్టు పక్కల రైస్‌మిల్లులున్నాయి. ఏటా సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొంటూ పైసా ఖర్చు లేకుండా మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పేరిట అప్పగిస్తోంది. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా, వారే అమ్ముకొని సొమ్ము చేసుకునే స్థాయికి దిగజా రారు. గతంలో జమ్మికుంట, హుజూరాబాద్‌లోని ఏడు మిల్లుల్లో తనిఖీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా రులు లక్షల క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. జమ్మికుంటకు చెందిన ఓ మిల్లులో దాదాపు 4 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం లోటును గుర్తించారు.
రైస్‌మిల్లర్ల సంఘం మౌనముద్ర
ధాన్యం కేటాయింపులో రైస్‌మిల్లర్ల సంఘం మధ్యవర్తిత్వం వహిస్తుండగా సదరు సంఘం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఏటా అక్రమాలు తారాస్థాయికి చేరుతుండగా లక్షల క్వింటాళ్ల ధాన్యం అమ్ముకున్నారని తేలుతుండగా రైస్‌మిల్లర్ల సంఘం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకర అంశం. అక్రమార్కులను సంఘం నుంచి బహిష్కరిస్తామని చెప్పడమే తప్పా ఆచరణలో కనిపించడం లేదు.
2024లో జమ్మికుంట మండలం కోరపల్లిలో శ్రీమహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్, ఇల్లందకుంట మ ండలం శ్రీరాములపల్లిలో శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో వెలుగుచూసిన రూ.130 కోట్ల ధాన్యం కుంభకోణం వ్యాపార లోకాన్నే నివ్వెరపరిచింది. మిల్లరు బండారు శారద యజమాని కాగా.. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్‌కు తరలించింది.
2025లో పెద్దపాపయ్యపల్లిలో రవిచంద్ర ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేయగా 32,207 క్వింటాళ్ల ధాన్యం కనిపించలేదు. వీటి విలువ రూ.6.68 కోట్లు. బోర్నపల్లిలోని విజయకృష్ణ మోడ్రన్ రైస్‌మిల్లులో 238.4క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కనిపించడంతో అధికారులే అవాక్కయ్యారు.
తాజాగా.. జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారులు త నిఖీ చేయగా బోర్నపల్లిలోని సాయిట్రేడర్స్, జగన్మాత ఇండస్ట్రీస్‌లో నిల్వల్లో భారీగా తేడాలు కనిపించాయి. సాయిట్రేడర్స్ యజమాని జ్యోతిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.


