జిల్లాలో 2024– 2026 మధ్య నమోదైన సైబర్‌నేరాల కేసులు
సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ.. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో దోపిడీ
కరీంనగర్‌క్రైం: జిల్లాలో సైబర్ నేరాలు కొత్త రూపం దాల్చుతున్నాయి. ఒకప్పుడు లాటరీ, బ్యాంక్ కాల్స్‌కే పరిమితమైన మోసాలు ఇప్పుడు పెట్టుబడులు, షేర్ ట్రేడింగ్, సోషల్ మీడియా, నకిలీ కొరియర్, ఉద్యోగాలు, లోన్‌యాప్, ఫేక్ కస్టమర్ కేర్ వరకు విస్తరించాయి. నేరుగా బ్యాంక్ వివరాలు అడగడం తగ్గించి, డబ్బు రెట్టింపు, షేర్ మార్కెట్‌లో భారీ లాభాలు, క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్, టెలిగ్రామ్ వీఐపీ గ్రూప్, పార్ట్‌టైమ్ ఉద్యోగం, ఆన్‌లైన్ టాస్క్ పేర్లతో ప్రజలను వలలోకి దింపుతున్నారు. మొదట చిన్న లాభాలు చూపించి నమ్మకం కల్పించి, తర్వాత రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టించి డబ్బుతో పరారవుతున్నారు. జిల్లాలోని సైబర్ నేరాల మూడేళ్ల విశ్లేషణలో ఈ అంశాలు స్పష్టమయ్యాయి.
పెట్టుబడులే ప్రధాన టార్గెట్
సైబర్ నేరాల్లో అత్యధికంగా నమోదయ్యేవి బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులేనని గణాంకాలను చూస్తే స్పష్టమవుతోంది. 2024లో 100 కేసుల్లో 53 పెట్టుబడి మోసాలవే ఉన్నాయి. 2025లో మొత్తం 39 కేసుల్లో 26 ఇదే తరహావి. 2026లో ఇప్పటివరకు నమోదైన 11 కేసుల్లో 8 కేసులు పెట్టుబడి మోసాలకు సంబంధించినవే. యేటా మొత్తం కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, పెట్టుబడి మోసాల శాతం పెరుగుతుండడం అత్యంత ఆందోళనకరంగా మారింది.
నేరాల పద్ధతిలో భారీ మార్పు
2024లో నమోదైన 100 కేసుల్లో బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ 53, ఐడెంటిటీ థెఫ్ట్ 25,, అడ్వర్టైజ్‌మెంట్ ఫేక్ కస్టమర్ కేర్ 8, ఆన్‌లైన్ ట్రేడింగ్ జాబ్ ఫ్రాడ్ 6, నకిలీ కొరియర్ 4, ఫేక్ బ్యాంక్ కస్టమర్ కాల్స్ 2, లాటరీ ఫ్రాడ్ 1, లోన్ యాప్ ఫ్రాడ్ ఒకకేసు నమోదయ్యాయి. 2025లో నమోదైన 39 కేసుల్లో బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ 26, సోషల్ మీడియా మోసాలు 4, సైబర్ టిప్‌లైన్ 3, ఉద్యోగాల పేరుతో సైబర్ స్లేవరీ 2, నకిలీ కొరియర్ 1, ఐడెంటిటీ థెఫ్ట్ 1, పోలీసులమంటూ బెదిరింపులు 1, చీటింగ్ ఐడెంటిటీ థెఫ్ట్ ఒకకేసు చొప్పున నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు నమోదైన 11 కేసులు బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ 8, లాటరీ ఫ్రాడ్ 1, ఆన్‌లైన్ ట్రేడింగ్ /ఇన్వెస్ట్‌మెంట్ 1, ఆన్‌లైన్ ట్రేడింగ్ జాబ్‌ఫ్రాడ్ ఒకటి జరిగాయి.
సంఖ్య తగ్గి.. ప్రమాదం పెరిగింది
2024లో 100 కేసులు నమోదుకాగా, 2025లో 39, 2026లో ఇప్పటివరకు 11 కేసులే నమోదయ్యాయి. కేసుల సంఖ్య తగ్గడాన్ని బట్టి సైబర్ నేరాలు తగ్గాయని భావించడం పొరపాటే. నమోదవుతున్న కేసుల్లో అత్యధికం భారీ మొత్తాల పెట్టుబడి మోసాలే కావడంతో ఒక్కోకేసులో బాధితులు రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు నష్టపోతున్నారు. మూడేళ్లలో నమోదైన 150 సైబర్ కేసుల్లో 87కేసులు (దాదాపు 58శాతం) పెట్టుబడి మోసాలే ఉండడంతో కరీంనగర్‌లో సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యం ఇప్పుడు పెట్టుబడిదారులేనని స్పష్టమవుతోంది. సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సంబంధం లేని లింకులను సోషల్ మీడియాలో ఓపెన్ చేయకూడదని, నేరాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ 87
ఐడెంటిటీ థెఫ్ట్ 26
అడ్వర్టైజ్‌మెంట్ ఫేక్ కస్టమర్ కేర్ 8
ఆన్‌లైన్ ట్రేడింగ్/జాబ్ ఫ్రాడ్ 7
సోషల్ మీడియా 4
నకిలీ కొరియర్ 5
ఉద్యోగాల పేరుతో సైబర్ స్లేవరీ 2
లాటరీ 2
ఫేక్ బ్యాంక్ కస్టమర్ కాల్స్ 2
చీటింగ్/ఐడెంటిటీ థెఫ్ట్ 1
పోలీసులమంటూ బెదిరింపు 1
లోన్ యాప్ ఫ్రాడ్ 1


