ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు
కరీంనగర్ అర్బన్: గ్యాస్ ఏజెన్సీలు అక్రమ దందాకు అడ్డాలుగా మారుతున్నాయి. నగరంలో 11 ఏజెన్సీలు ఉండగా, నిర్వాహకులు వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వినియోగదారుకు తెలియకుండానే బుక్ చేసిన సిలిండర్ మాయం చేస్తున్నారు. సేల్స్ ఆఫీసర్ల పర్యవేక్షణ డొల్లతనం.. అధికారుల ఆకస్మిక తనిఖీలు కరవవడం ఇందుకు కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
బుక్ చేస్తే బ్లాక్ మార్కెట్‌కే
వినియోగదారు గ్యాస్ బుక్ చేస్తే రెండ్రోజుల్లోనే ఇంటికి చేరాల్సిన సిలిండర్ రాకపోగా డెలివరీ అయినట్లుగా మెసేజ్ వస్తోంది. ఇదేంటని ఆశ్చర్యపోయిన కస్టమర్ ఏజెన్సీకి వెళ్లి నిలదీస్తే పంపిస్తున్నారు. కొందరు మాకేం సంబంధమంటూ దురుసుగా ప్రవర్తిస్తుండగా సేల్స్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే తప్పా గ్యాస్ డెలివరీ చేయడం లేదు. జిల్లాలో వేలమంది ఇదే సమస్యను ఎదుర్కొంటుండగా తనిఖీలపై అధికారులు దృష్టి సారించడం లేదు.
మహాలక్ష్మి పథకం ఏజెన్సీలకు వరం
మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారు రూ.1013 చెల్లిస్తుండగా ప్రభుత్వం రూ.500కు మించిన నగదును ఖాతాలో జమ చేస్తోంది. ఈ నేపథ్యంలో పథకాన్ని తమ వ్యాపారానికి అనువుగా మలచుకున్నారు పలువురు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. కార్డుదారులతో ఒప్పందం కుదుర్చుకుని టిఫిన్ సెంటర్లు, దాబాలు, రెస్టారెంట్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, బేకరీలు, జిలేబీ కేంద్రాలకు తరలిస్తున్నారు. వినియోగదారులకు సిలిండర్లు చేరాల్సి ఉండగా నేరుగా వ్యాపార కేంద్రాలకు తరలిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర మూడు వేల వరకు ఉండగా వంటగ్యాస్ సిలిండర్ రూ.1013కే లభిస్తుండటంతో వేల సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి.
నిబంధనలేం చెబుతున్నాయ్
వంటగ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్న తదుపరి వినియోగదారు ఇంటికి డెలివరీ బాయ్స్ చేర్చాలి. 5 కిలోమీటర్లలోపు దూరం ఉంటే ఉచితంగా అందించాలి. కమర్షియల్ సిలిండర్లను వ్యాపార కేంద్రాలకు సరఫరా చేయాలి. కానీ వంట గ్యాస్ సిలిండర్లను రాత్రి, వేకువజామున నేరుగా టిఫిన్ సెంటర్లకు, పెద్ద పెద్ద హోటళ్లకు చేర్చుతున్నారు. గ్యాస్ పక్కదారి పడితే చర్యలు తీసుకుంటామని, తనిఖీ లు నిరంతరం చేస్తామని డీఎస్వో నర్సింగరావు వివరించారు.
తీగలగుట్టపల్లికి చెందిన పద్మ హెచ్‌పీ గ్యాస్ వినియోగదారు. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేస్తే గత నెల 17న డెలివరీ అయిందని, మరోసారి బుక్ చేయాలంటే మరింత సమయం వేచిచూడాలని సందేశం వచ్చింది. గత నెలలో గ్యాస్ బుక్ చేయకపోగా ఎవరికి డెలివరీ చేశారు, ఎవరు బుక్ చేశారు అని ఎస్సారార్ కళాశాల రోడ్డులో ఉన్న
ఏజెన్సీని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.
ఆయిల్ కంపెనీలపై: 1906
ఇండెన్: 9986998433
హెచ్‌పీ: 18002333555
భారత్: 1800224344
కోతిరాంపూర్‌లో నివాసముండే అజయ్‌కి నగరంలోని హనుమాన్‌నగర్‌లో ఉన్న ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ ఉంది. గ్యాస్ బుక్ చేయగా.. డెలివరీ బాయ్ ఫోన్ చేసి ఓటీపీ అడిగాడు. అజయ్ ఓటీపీ చెప్పడంతో సదరు వ్యక్తి గ్యాస్‌ను ఇతరులకు అధిక ధరకు అమ్ముకున్నాడు. తన ఇంటికి గ్యాస్ రాలేదని ఏజెన్సీలో ఫిర్యాదు చేస్తే ఓటీపీ చెప్పాక తమకు సంబంధం లేదని, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని నిర్వాహకులు చేతులెత్తేశారు.


