కరీంనగర్‌టౌన్: మహిళా నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది. జిల్లాలో ఖాళీగా ఉన్న 60 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 20 పోస్టులు, హుజూరాబాద్ పరిధిలో 16, కరీంనగర్ రూరల్ పరిధిలో 16, కరీంనగర్ అర్బన్ పరిధిలో 08 టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 15 సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇంటర్ విద్యార్హతతో..
అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు గతంలో పదో తరగతి ఉత్తీర్ణత విద్యార్హత ఉండేది. తాజాగా ఇంటర్మీడియట్‌కు పెంచారు. కేంద్రాల నిర్వహణలో సాంకేతిక వినియోగం, ఆన్‌లైన్ రికార్డుల నమోదు, మొబైల్ యాప్ ద్వారా రోజువారీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి.. వివాహితురాలై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికురాలై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్ మార్కులు, ఇంటర్వ్యూలో నైపుణ్యం ద్వారా అభ్యర్థులను కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఎంపిక చేస్తారని శిశు సంక్షేమశాఖ డీడీ సరస్వతీ వెల్లడించారు.


