ట్రాఫిక్‌ విధుల్లో ‘నో’ సెల్‌ఫోన్‌! | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ విధుల్లో ‘నో’ సెల్‌ఫోన్‌!

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

పోలీసులకు డీజీపీ ఆదేశాలు ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి పెట్టేందుకే నిర్ణయం విధులకు వచ్చే ముందు ఫోన్లు ఇంట్లోనే తీసుకొస్తే స్టేషన్‌లో డిపాజిట్‌ అధికారులకు కమ్యూనికేషన్‌ కోసం మినహాయింపు కరీంనగర్‌లో అమల్లోకి ఉత్తర్వులు

కరీంనగర్‌క్రైం: ట్రాఫిక్‌ నియంత్రణలో ఆటంకాలు లేకుండా, ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్ర పోలీసుశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్‌ పోలీసులు విధుల్లో వ్యక్తిగత సెల్‌ఫోన్లు ఉపయోగించొద్దని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో కరీంనగర్‌ కమిషనరేట్‌వ్యాప్తంగా ట్రాఫిక్‌ సిబ్బంది సెల్‌ఫోన్లు లేకుండానే విధులకు హాజరవుతున్నారు. జంక్షన్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఫోన్లలో మాట్లాడటం, సోషల్‌ మీడియా వినియోగించడం, వ్యక్తిగత కాల్స్‌కు స్పందించడం ద్వారా ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రభావం పడుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విధుల సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగాన్ని నిషేధిస్తూ పోలీస్‌బాస్‌ ఆదేశాలిచ్చారు.

అయితే ఇంట్లో.. లేకపోతే స్టేషన్‌లో డిపాజిట్‌

కమిషనరేట్‌ పరిధిలో చాలామంది ట్రాఫిక్‌ పోలీసులు వ్యక్తిగత సెల్‌ఫోన్లను ఇంట్లోనే ఉంచి విధులకు హాజరవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంట తీసుకొచ్చినా పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్‌ చేసి, డ్యూటీ పూర్తయిన తర్వాత తీసుకుంటున్నారు. దీంతో విధి నిర్వహణ సమయంలో వ్యక్తిగత ఫోన్‌ వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట పడుతోంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఒక్క క్షణం నిర్లక్ష్యం జరిగినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అధికారులకు మినహాయింపు

ట్రాఫిక్‌ విభాగంలో విధులు నిర్వహించే ఉన్నతాధికారులకు అధికారిక కమ్యూనికేషన్‌, అత్యవసర సమాచార మార్పిడి కోసం సెల్‌ఫోన్లు వినియోగించే వెసులుబాటు కల్పించారు. కరీంనగర్‌ ట్రాఫిక్‌ విభాగంలో ప్రస్తుతం ఒక ఏసీపీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, సుమారు 65మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కొత్త ఆదేశాల మేరకు ఫీల్డ్‌ సిబ్బంది సెల్‌ఫోన్లు ఉపయోగించకుండా విధులు నిర్వహిస్తున్నారు.

వేగవంతమైన సేవలు

ట్రాఫిక్‌ నియంత్రణలో ఎలాంటి అంతరాయాలు లేకుండా, ప్రమాదాలను తగ్గించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు విధించడానికి ఫొటోలు తీసి, తిరిగి వాటిని డిలీట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు రావడం కూడా ఈ నిర్ణయానికి కారణంగా చర్చ జరుగుతోంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారుల ఫొటోలు తీసి చలాన్లు వేయడానికి పోలీసులకు త్వరలోనే ప్రత్యేక కెమెరాలు అందించనున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement