కరీంనగర్ అర్బన్: రేషన్ లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా ఈ– కేవైసీ చేయించాలని పౌరసరఫరాలశాఖ ఆదేశాలిచ్చిన విషయం విదితమే. కేవైసీ నమోదు చేసిన వారికే సరుకులు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతుండటంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్తున్నారు. కొంతమంది ఆధార్ కార్డు అప్డేట్ లేకపోవడంతో ఈ–కేవైసీ కావడం లేదు. కార్డు అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు పరుగు పెడుతున్నారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు విధిగా ఈ–కేవైసీ చేసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి.
ఆధార్ అప్‌డేట్ కోసం పరుగులు
10ఏళ్ల క్రితం పొందిన ఆధార్ కార్డులను నవీకరణ చేసుకోకపోవడంతో చాలామందికి సమస్య ఎదురవుతోంది. ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్రలు 24 గంటల సమయంలో అప్‌డేట్ అవుతుంది. ఒక్కోసారి వారం కూడా పడుతుందని ఆధార్ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆధార్ నవీకరణ పూర్తికాకపోతే రేషన్‌కార్డు నుంచి పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉంది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
సమస్యలెన్నో
కార్డులో పేర్లున్న చిన్నారులకు, తల్లిదండ్రుల వేలిముద్రలతో ఆధార్ కార్డు జారీ చేస్తారు. వారి వయసు అయిదేళ్లు దాటగానే.. వేలిముద్రలు, ఫొటోను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో చాలా మంది చిన్నారులు కార్డులను నవీకరించుకోలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది చిన్నారులు ఊరికి దూరంగా చదువుల నిమిత్తం వేరే పట్టణాలు, వసతి గృహాల్లో ఉంటున్నారు. సదరు విద్యార్థులు ఈ– కేవైసీ కోసం ఇంటికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. వారి పేర్లు తొలగిపోతాయనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వారికి ఫోన్లు చేసి ఇంటికి వచ్చి ఈ–కేవైసీ చేసుకోవాలని కోరుతున్నారు. లబ్ధిదారులు తమ పరిధిలోని చౌక ధరల దుకాణం నుంచే కాకుండా దేశంలో ఎక్కడి నుంచైనా ఈ– కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
కార్డులో పేర్లున్న వారంతా..
ఈ– కేవైసీ నమోదులో వేలి ముద్రపడకపోవడం, పదేళ్లలోపు చిన్నారుల ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఆధార్‌లో తప్పులు తదితర సమస్యలతో నమోదు ప్రక్రియ జిల్లావ్యాప్తంగా నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 3లక్షల కార్డులుండగా 11లక్షల యూనిట్లకు 9లక్షల వరకు కేవైసీ చేసుకున్నట్లు సమాచారం. కార్డులోని ఎవరో ఒకరు వెళ్లి వేలిముద్ర వేస్తే సరకులు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ– కేవైసీ కోసం కార్డులో పేర్లున్న ప్రతి ఒక్కరూ రేషన్ దుకాణానికి వెళ్లాల్సిందే. ఒక కార్డులో ఐదుగురు లబ్ధిదారులుగా ఉంటే వారంతా.. తమ ఆధార్, రేషన్ కార్డులతో వెళ్లి ఈ– కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


