ఖాదర్‌గూడెంలో క్రేన్‌సాయంతో బావిలో పూడికతీత పనులు
పచ్చునూరులో మిషన్‌తో
బావిలో పూడికతీత పనులు
మానకొండూర్: వర్షాలతో చెరువులు, కుంటలు నిండి వ్యవసాయ బావుల్లో నీరు ఉబికివచ్చే రోజులివి. ఈ సీజన్‌లో చినుకు జాడ లేకపోగా.. ప్రాజెక్టులు నీరులేక వెలవెలబోతున్నాయి. బావుల్లో చుక్కనీరు లేకపోగా.. బోర్లు ఎప్పుడో వట్టిపోయాయి. తొలకరి చినుకుల ఆశలతో పంటలు వేసిన రైతులు వా టిని కాపాడుకునేందుకు వ్యవసాయ బావుల్లో పూడి క తీస్తున్నారు. అప్పులు చేసి క్రేన్లు, ఇటాచీ మిషన్లతో పూడిక తీయిస్తున్నారు. కొంతమంది కొత్తగా బోర్లు తవ్విస్తున్నారు. మానకొండూర్ మండలంలోని ప్రతీ గ్రామంలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. క్రేన్‌తో పూడికతీతకు గుంటకు రూ.450 నుంచి రూ.500 తీసుకుంటున్నారని, ఇటాచీ మిషన్‌తో పూడికతీత పనులు చేపడితే గంటలకు రూ.5,800 తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు చేస్తున్న భగీరథ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. కాగా.. మండల పరిధిలో సాగు విస్తీర్ణం 36,870 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 27వేల ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో 26వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఈ నెలాఖరు వకు వర్షాలు సమృద్ధిగా కురవకుంటే ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.


