కొత్తపల్లి: కొత్తపల్లి మండలం ఖాజీపూర్ పరిధిలోని మానేరు వాగులో నిర్వహిస్తున్న ఇసుక క్వారీని రద్దు చేయాలని సర్పంచ్ కోమటిరెడ్డి అంజనీకుమార్ ఆధ్వర్యంలో క్వారీ వద్ద మూడు రోజులుగా గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మంగళవారం మహిళలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు. ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని తెలిపారు. ఇసుక తరలింపు వల్ల గ్రామస్తుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీని కొనసాగించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. స్థానికుల ఆరోగ్యం, జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ క్వారీని రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


