నీలి విప్లవానికి నీటిగండం | - | Sakshi
Sakshi News home page

నీలి విప్లవానికి నీటిగండం

Jul 9 2026 6:59 AM | Updated on Jul 9 2026 6:59 AM

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు

నీటి మట్టం తగ్గిపోయిన నాగారం చెరువు

నీళ్లు లేక వెలవెలబోతున్న సుందిళ్ల బ్యారేజీ

మంథనిరూరల్‌: మత్స్యకారులకు ఉపాధి మెరుగుపర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న చేపపిల్లల పంపిణీకి ఈసారి నీటిగండం ఏర్పడుతోంది. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు సాధారణ వర్షాలు తప్ప భారీవానలు కురవలేదు. దీంతో జిల్లాలోని అనేక చెరువులు, జలాశయాలు అడుగంటి పోతున్నాయి. ఏటా జూలై, ఆగస్టలోనే చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారు. ఈసారి పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన జారీచేయలేదు. మరోవైపు వర్షాలు లేక చెరువుల్లోకి నీళ్లు రాలేదు. చేపల పెంపకం ఎలా అని మత్స్యకారుల్లో ఆందోళన చెందుతున్నారు.

జిల్లావ్యాప్తంగా 281 సొసైటీలు

పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 281 మత్స్యకార సొసైటీలు ఉండగా 13,450 మంది సభ్యులు ఉన్నారు. అలాగే జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల పరిధిలో 1,073 చెరువులు, కుంటలు ఉన్నాయి. చెరువులు, కుంటలతోపాటు జలాశయాల్లో ప్రభుత్వం ఏటా చేపపిల్లలు విడుదల చేస్తోంది. రెండేళ్లుగా పంపిణీ సక్రమంగా జరడంలేదు. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయి.

వానలు కురువక.. నిండని చెరువులు

ఏటా వర్షాకాలం ప్రారంభమైన నెలరోజుల వ్యవధిలోనే భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారేవి. జూన్‌చివరి వారం నుంచి జూలై, ఆగస్టు మాసాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి చేపపిల్లల పంపిణీ ప్రారంభించేవారు. ఈసారి వర్షాలు కురువక చెరువులు నిండకపోగా జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం సైతం ఇప్పటివరకు పంపిణీపై స్పష్టత ఇవ్వడంలేదు.

మత్స్యకారులకు చేపలతో ఉపాధి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే చేపపిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. గత ప్రభుత్వం చెరువులతోపాటు జలాశయాల్లోనూ చేపపిల్లలను వదిలిపెట్టడంతో అనేకమంది మత్స్యకారులు చేపలు పట్టుకుని ఉపాధి పొందారు.

చేపపిల్లల పంపిణీపై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఏటా జూలైలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టులో చేపపిల్లలు పంపిణీ చేస్తాం. ఈసారి టెండర్‌ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం.

– నరేశ్‌ నాయుడు,

జిల్లా మత్స్యశాఖ అధికారి,పెద్దపల్లి

వర్షాలు లేక చెరువులు, జలాశయాలు వెలవెల

చేపపిల్లల పంపిణీపై స్పష్టత ఇవ్వని సర్కారు

ఈసారైనా పంపిణీ ఉన్నట్లా? లేనట్లా?

ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement