టెస్కోకు సర్కారు మస్కా | - | Sakshi
Sakshi News home page

టెస్కోకు సర్కారు మస్కా

Mar 14 2026 7:35 AM | Updated on Mar 14 2026 7:35 AM

సిరిసిల్ల: రాష్ట్రంలోని పేద ముస్లింలకు రంజాన్‌ తోఫాను ప్రభుత్వం అందిస్తోంది. ఏటా రంజాన్‌ కానుకగా కొత్త వస్త్రాలను పంపిణీ చేస్తుంది. ఈ వస్త్రాల ఆర్డర్లను రంజాన్‌ పండగకు ఆరునెలల ముందే టెస్కోకు ఇస్తే.. ఆ సంస్థ రాష్ట్రంలోని చేనేత, పవర్‌లూమ్స్‌ సహకార సంఘాల ద్వారా వస్త్రాలను సేకరించి ప్రభుత్వానికి అందిస్తుంది. కానీ ఈ ఏడాది రంజాన్‌ తోఫా వస్త్రాల ఆర్డర్లను హైదరాబాద్‌కు చెందిన విజయానంద్‌ సిల్క్స్‌ మిల్లుకు అందించారు. రంజాన్‌ వస్త్రాల ఆర్డర్ల ఖరీదు రూ.60 కోట్లు కాగా.. ఈమేరకు ప్రైవేటు మిల్లుకు అందించారు. రాష్ట్ర స్థాయిలో మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో టెస్కోకు రావాల్సిన ఈ ఆర్డర్‌ జీవోకు విరుద్ధంగా ప్రైవేటు కంపెనీ పరమైంది. ఇదే బాటలో మరిన్ని ఆర్డర్లు టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని, టెస్కోకు మస్కా కొట్టి.. ఆ సంస్థ పక్కన పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఫలితంగా పేద నేత కార్మికుల ఉపాధికి గండిపడుతుంది.

టెండర్ల దిశగా సర్కారు

రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దల సూచనలతో కేంద్రీకృత టెండర్ల విధానంలో ఇతర వస్తువులతోపాటు వస్త్రాలను సైతం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ టెండర్లలో టెస్కో కూడా పాల్గొనవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద వస్త్రోత్పత్తి మిల్లులతో టెస్కో పోటీ పడే పరిస్థితి ఉండదు. దీంతో టెండర్ల దిశగా సర్కారు పావులు కదుపుతుంది. కానీ క్షేత్రస్థాయిలో రెక్కల కష్టాన్ని నమ్ముకున్న చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల ఉపాధిని గాలికి వదిలేసినట్లు అవుతుందనే సత్యాన్ని విస్మరిస్తూ జీవోకు విరుద్ధంగా సర్కారు సిద్ధమైనట్లు సమాచారం. ఈ అంశంపై చేనేత, పవర్‌లూమ్‌ సహకార సంఘాలకు చెందిన పెద్దలు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రులను కలిసి సమస్యను విన్నవించుకున్నా.. వారు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. వ్యవసాయ రంగం తరువాత రెండో స్థానంలో ఎక్కువ మందికి ఉపాధి చూపుతున్న వస్త్రోత్పత్తి రంగాన్ని విస్మరిస్తూ టెండర్ల విధానానికి మొగ్గు చూపడం విడ్డూరంగా ఉంది. టెండర్ల విధానంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారి ప్రభుత్వ పెద్దలకు భారీగా ప్రయోజనం కలుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. నేతన్నల ఉపాధిని పణంగా పెట్టి టెండర్ల విధానంతో టెస్కోకు మస్కా కొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా వస్త్రోత్పత్తి రంగంలో చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులకు యూనిపాంలు, దుప్పట్ల తయారీ ఆర్డర్లను ప్రభుత్వం అందించేది. ఆయా సంక్షేమశాఖల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్డర్లు తీసుకుని టెస్కోకు అందించాల్సి ఉంది. రాష్ట్రంలోని 334 సహకార సంఘాల టెస్కో వస్త్రాలను తయారు చేయిస్తుంది. జనవరిలోనే సంక్షేమశాఖల ఆర్డర్లు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు మహిళా సంఘాల ద్వారా కుట్టు పనులు పూర్తి చేసి మే నెలలో విద్యాసంస్థలకు అందించడం ఆనవాయితీ. ఈ విధానంతో చేనేత, పవర్‌లూమ్‌ రంగంలోని 69వేల మంది కార్మికులు ఉపాధి పొందుతారు. ఏటా రూ.590 కోట్ల విలువైన వస్త్రాల ఆర్డర్లు టెస్కోకు వస్తుండగా... 2026–2027 విద్యాసంవత్సరానికి విద్యాశాఖ, సీ్త్రశిశుసంక్షేమ, వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్‌శాఖల నుంచి సుమారు రూ.390 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ఆర్డర్లు సుమారు రూ.200 కోట్ల ఆర్డర్లు రాలేదు. దీంతో టెస్కో ఆందోళనకు గురి అవుతుంది. ప్రభుత్వ ఆర్డర్లు వస్తేనే క్షేత్రస్థాయిలో చేనేత, పవర్‌లూమ్‌ సహకార సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లను టెస్కో అందించే అవకాశం ఉంది.

అందని ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు

టెండర్ల ద్వారా వస్త్రాల కొనుగోలు

రాష్ట్రంలోని చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు మొండి‘చెయ్యి’

జీవోకు విరుద్ధంగా సర్కారు పెద్దల నిర్ణయాలు

ప్రైవేటు కంపెనీకి రంజాన్‌ తోఫా వస్త్రాల ఆర్డర్లు

అదే బాటలో మరిన్ని వస్త్రోత్పత్తి ఆర్డర్లు

చేనేత సహకార సంఘాలకు, మ్యాక్స్‌ సంఘాలకు మరణ శాసనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement