కరీంనగర్: స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం గుండెల్లో రణభేరి మోగించిన అనభేరి ప్రభాకర్‌రావు 78వ వర్ధంతి వేడుకలు శనివారం నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. రజకార్లు, నిజాం పాలననుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో తొలి దళాన్ని ఏర్పాటు చేసుకోని నిజాం రాకాసి మూకల చేతుల్లో హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అనభేరి ప్రభాకర్‌రావు వర్ధంతిని జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ వద్ద, మహ్మదాపూర్‌లో నిర్వహించే వేడుకలకు సీపీఐ కార్యకర్తలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.
వ్యక్తి రిమాండ్
చందుర్తి(వేములవాడ): మైనర్ బాలికకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించేందుకు సహకరించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని బండపల్లికి చెందిన మైనర్ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించేందుకు బాలుడికి అదే గ్రామానికి చెందిన పల్లపు నవీన్ సహకరించాడు. విచారణలో తను నేరం చేసినట్లు అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు.
స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లిన వలసజీవి గుండెపోటుతో మృతిచెందగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో వారం రోజులకే మృతదేహం స్వగ్రామానికి శుక్రవారం చేరుకుంది. ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన రాగం ప్రశాంత్(30) ఈనెల 7న మస్కట్‌లో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రశాంత్ మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయన చొరవతో ప్రశాంత్ మృతదేహం సేవాలాల్‌తండాకు శుక్రవారం చేరుకుంది. ప్రశాంత్ మృతదేహం ఇంటికి చేరగానే తల్లిదండ్రులు దేవయ్య, మంజుల, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బీజేపీ కార్యకర్త అయిన ప్రశాంత్‌కు మండలశాఖ అధ్యక్షుడు సౌల్లక్రాంతి జెండా కప్పి నివాళులు అర్పించారు.
మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలోని గ్రంథాలయం రోడ్‌లో గల రవికుమార్ జ్యువెల్లరీ దుకాణంలో చోరీ జరిగింది. వివరాలు.. దుకాణం యాజమాని అనిల్ గురువారం రాత్రి ఎప్పటి లాగే తాళం వేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించిన కొందరు అనిల్‌కు సమాచారమందించారు. వెంటనే అతడు చేరుకొని షాపులోకి వెళ్లి చూడగా, అందులో ఉన్న 20గ్రాముల బంగారం అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.


