కారుణ్య నియామకాలపై కరుణ చూపేనా..?!
ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయింది
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో పదినెలల క్రితం కారుణ్య నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఒకట్రెండు హైయ్యర్ మెడికల్ బోర్డులు నిర్వహించినా ప్రయోజనం లేదు. సంస్థలో ఇప్పటికే అదనంగా సుమారు 7వేల మంది కార్మికులు ఉన్నారని, ప్రస్తుతానికి మెడికల్ బోర్డు ద్వారా కార్మికులను నియమిస్తే సంస్థకు భారంగా మారుతుందని యాజమాన్యం చెబుతోంది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ ఇటీవల భేటీ అయ్యారు. సంస్థ సమస్యల గురించి వివరించారు. స్పందించిన డిప్యూటీ సీఎం.. కార్మికుల సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఇన్‌కంత్యాక్స్ రీయింబర్స్‌మెంట్‌పై సింగరేణి అధికారులతో కమిటీ నియమిస్తామన్నారు. మారుపేర్ల డిపెండెంట్ల సమస్య కోర్టులో ఉన్నందున త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని అభయం ఇచ్చారు. తండ్రి పేరు, ఇంటిపేరు, చిన్న సమస్యలతో విజిలెన్స్‌కు మారుపేర్లు డిపెండట్ కేసులు వెళ్లడంతో సుమారు 400మందికిపైగా ఉద్యోగాలు నిలిచిపోయాయి. కుటుంబ పెద్దకు బెనిఫిట్స్ రాలేదు. కొడుక్కి ఉద్యోగం దక్కలేదు. దీంతో చాలాకుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయి.
ముందడుగు పడేనా..
దేశంలోనే ఏ బొగ్గు గనిలోనూ కారుణ్య నియామకాలు లేవు. సింగరేణి 9 మార్చి 2018 నుంచి కారుణ్య నియామక ప్రక్రియ పునరుద్ధరించారు. అప్పటి సీఎం కేసీఆర్ ఇందుకు చొరవ తీసుకున్నారు. ఈక్రమంలో మొన్నటివరకు మెడికల్ బోర్డులో కనీసం 88శాతం వరకు అన్‌ఫిట్ కొనసాగింది. అన్‌ఫిట్‌అయిన వారిపిల్లలకు ఉద్యోగాల నియామక ప్రక్రయ కొనసాగింది. కానీ, గతేడాది జూన్‌లో ఈప్రక్రియ నిలిపివేశారు. 2025 జూలైలో మయ్యర్ మెడికల్ బోర్డు నిర్వహించగా 55మందిలో ఒకరు గైర్హాజర్‌కాగా 54మందిలో ఐదుగురునే మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. మిగతా వారిని ఫిట్‌ఫర్ సేమ్‌జాబ్, ప్రత్యామ్నాయ ఉద్యోగాల్లో కొనసాగాలని ఆదేశాలిచ్చారు. కార్మికుల అనారోగ్య పరిస్థితిని దృష్టి ఉంచుకుని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సూచించింది. వీరికి గతేడాది నవంబర్‌లో మెడికల్ బోర్డు నిర్వహించగా 129మంది హాజరయ్యారు. వీరిలో 24మందిని మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. మిగతా వారిని ఫిట్‌ఫర్ సేమ్‌జాబ్, సర్‌ఫేస్ ఉద్యోగాలతో సరిపుచ్చారు. వీరిలో చాలామంది ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది.
పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ
కోలిండియాలో కార్మికుల అలవెన్స్‌లు(పెర్క్స్)పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ వర్తిస్తోంది. సింగరేణిలో అమలు కావడం లేదు. దీనిపై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు హామీ ఇచ్చింది. అయినా సింగరేణి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కార్మికులకు సొంతింటి పథకం అమలు చేస్తామన్నా.. ఇప్పటివరకు ముందడుగు పడలేదు
మారుపేర్ల డిపెండెంట్లపై సానుకూల దృష్టి
సింగరేణి సమస్యలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి
సింగరేణి కార్మికుల సమస్యలపై డిప్యూటీ సీఎంతో మాట్లాడి పరిష్కారానికి ఒప్పించాం. కొన్ని సమస్యల పరిష్కారానికి సింగరేణి అధికారులతో కమిటీ వేయడం, మరికొన్నింటిని వెంటనే పరిష్కరించేలా ఉన్నతాధికారులకు సూచించారు. సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగుతుంది.
– జనక్‌ప్రసాద్,
ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్
కారుణ్య నియామకాలపై కరుణ చూపేనా..?!


