కేటీఆర్ వాహనం తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వాహనాన్ని రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద గురువారం అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల నియామవళిలో భాగంగా అధికారులు వాహనాన్ని ఆపగా కేటీఆర్ కారు ఆపి కిందికి దిగి అధికారులకు సహకరించారు. తనిఖీ అనంతరం కేటీఆర్ సిరిసిల్లలోని బీఆర్‌ఎస్ భవన్‌కు బయలుదేరారు.
మగ్గిడి గురుకులం ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ధర్మపురి: మండలంలోని మగ్గిడి గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ పద్మను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడినట్లు ఎంఈవో సీతామహాలక్ష్మి తెలిపారు. పద్మ సమయపాలన పాటించకపోవడం, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పాలనసరిగా లేదని వచ్చిన ఆరోపణలపై సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
డబ్బులు అడిగేందుకు వెళ్తే నిర్బంధం
జగిత్యాలక్రైం: యూట్యూబ్ ఛానల్‌లో నటించినందుకు డబ్బులు అడిగితే న్యాయవాదిని నిర్బంధించిన ఘటన జగిత్యాలరూరల్ మండలం ఒడ్డెరకాలనీలో గురువారం చోటుచేసుకుంది. ఒడ్డెరకాలనీకి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. అందులో కొడిమ్యాలకు చెందిన ఓ యువతి రోజుకు రూ.1500 చొప్పున మాట్లాడుకుని షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది. కానీ.. చానల్ నిర్వాహకుడు డబ్బులు ఇవ్వలేదు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో యువతి ఓ న్యాయవాదిని తీసుకుని ఒడ్డెరకాలనీకి వెళ్లి డబ్బులు అడిగింది. దీంతో సదరు నిర్వాహకుడు న్యాయవాదితోపాటు యువతిని కూడా నిర్బంధించాడు. యువతి తప్పించుకుని 100కు డయల్ చేయడంతోపాటు, పలువురికి సమాచారం అందించింది. వెంటనే పోలీసులు ఒడ్డెరకాలనీకి వెళ్లి న్యాయవాదితోపాటు, యువతిని తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో హైదరాబాద్‌లోని షాద్‌నగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రరాష్ట్రానికి చెందిన కొందరు గురువారం ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. ఈ ముఠా షాద్‌నగర్‌లోని ఓ యూనివర్సిటీకి చెందిన పెంపుడు కుక్కలను వాళ్ల పర్మిషన్ లేకుండా తీసుకెళ్లి చంపేశారని తెలిసింది. ఈ సంఘటనపై యూనివర్సిటీ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సెల్‌ఫోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు వేకువజామున అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. అనంతరం వారిని షాద్‌నగర్‌కు తరలించారు.


