పాడి వర్సెస్ పోలీసులు
● జాతర వేళ హుజూరాబాద్‌లో హైడ్రామా
● వీణవంక సమ్మక్క జాతర వద్ద అడ్డుకున్న పోలీసులు
● ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్/వీణవంక: వీణవంక సమ్మక్క జాతరలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని గురువారం సాయంత్రం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కౌశిక్‌రెడ్డి ఏసీపీ మాధవి, సీఐ లక్ష్మినారాయణతో వాగ్వాదానికి దిగారు. చివరికి ఎమ్మెల్యేను శంకరపట్నం, సైదాపూర్‌కు తరలించా రు. ఎమ్మెల్యే సతీమణి శాలినిని గద్దెలనుంచి తరలించడంపై కంటతడి పెట్టారు. మొక్కులు చెల్లించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
క్యాంపు ఆఫీస్ నుంచే అడ్డగింత
వీణవంకలో సమ్మక్క జాతరకు ట్రస్టీగా ఉన్న ఉదయానందరెడ్డి వర్గానికి కౌశిక్‌రెడ్డి వర్గానికి విభేదాలు సాగుతున్నాయి. కౌశిక్‌రెడ్డి జాతరకు వెళ్తే గొడవ జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు గురువారం సాయంత్రం క్యాంపు ఆఫీసు వద్దే అడ్డుకున్నారు. పోలీసుల నిర్ణయాన్ని వ్యతిరేకించిన కౌశిక్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట గల కరీంనగర్– వరంగల్ ప్రధాన రహదారిపై కుటుంబసభ్యులతో కలిసి బైటాయించి పోలీసుల తీరుపై మండిపడ్డాడు. అనంతరం వీణవంక వెళ్లగా జాతర ప్రాంగణంలో పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని శంకరపట్నం, సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. సమ్మక్క జాతరకు ఒక మహిళా సర్పంచ్ చేతి మీదుగా కొబ్బరికాయ కొట్టించాలని, ప్రైవేటు వ్యక్తికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.
కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవడంతో పాటు, ఇతర వివాదాస్పద కారణాలతో సెక్షన్ 341, 353, 295, 506, 140(3ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు.


