తల్లీ.. నీకు వందనం
‘మాది రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక. నా పేరు బొమ్మెన రామవ్వ. నా వయసు 74 ఏళ్లు. నా భర్త చనిపోయాడు. మా ఇద్దరు కొడుకుల్లో ఒక్కరు మరణించారు. ఒక్క కొడుకు ఉన్నాడు. మధ్యమానేరు జలాశయంలో మా ఊరు మునిగిపోయింది. 2010లో మా 14 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు తీసుకున్నారు. పరిహారం ఇవ్వలేదు. కలెక్టరేట్‌కు, ఆర్డీవో ఆఫీస్‌కు ఎన్నిసార్లు తిరిగినా పరిహారం సొమ్ము ఇవ్వలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాము. కోర్టులో మాకు సానుకూలంగా తీర్పు వచ్చింది. కానీ పరిహారం చెల్లించలేదు. మరోసారి కోర్టుధిక్కరణ కింద కోర్టును ఆశ్రయించాను. 15 ఏళ్లుగా పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాను’ ఇదీ మధ్యమానేరు నిర్వాసితురాలు రామవ్వ ఆవేదన.
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన సందీప్‌కుమార్ ఝా, అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్ ప్రస్తుతం ఆ విధుల్లో లేరు. వేరే శాఖలో పనిచేస్తున్నారు. కానీ కోర్టు ఆదేశాలను విధుల్లో ఉండగా నిర్లక్ష్యం చేసిన కారణంగా మార్చి 24న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తాము బదిలీ అయ్యామని చెబితే కుదరదని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం స్పష్టం చేశారు. 2024 ఆగస్టు 14న విచారణ సందర్భంగా మూడు నెలల్లో పరిహారాన్ని నిర్వాసితురాలికి అందిస్తామని అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్, అప్పటి రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పష్టం చేశారు. కానీ పరిహారం చెల్లించకుండా.. కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద బదిలీ అయినా అధికారులతోపాటు ప్రస్తుత సీసీఎల్‌ఏ లోకేశ్‌కుమార్, ప్రస్తుత రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరీమా అగ్రవాల్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు విచారణకు ఎవరూ హాజరుకాకుండా.. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 24న విధిగా అప్పటి అధికారులు నవీన్‌మిత్తల్, సందీప్‌కుమార్ ఝా హాజరుకావాలని స్పష్టం చేశారు. ప్రస్తుత కలెక్టర్ గరీమా అగ్రవాల్, సీసీఎల్‌ఏ లోకేశ్‌కుమార్‌కు కోర్టు మినహాయింపు పిటిషన్‌కు అనుమతించారు.
బదిలీ అయినా బాధ్యతల నుంచి తప్పించుకోలేదు
ప్రభుత్వ అధికారులు విధుల్లో ఉండగా కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా బదిలీ అయినా కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు బాధ్యత వహించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు బదిలీ అయినా ఇద్దరు ఐఏఎస్‌లు విధిగా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అధికారులకు బదిలీలు అతి సాధారణమైనా విధుల్లో ఉండగా వచ్చిన కోర్టు ఆదేశాలును అమలు చేయకుంటే వెంటాడుతాయనే కొత్త కోణం బొమ్మెన రామవ్వ కేసు నిరూపిస్తోంది. 15 ఏళ్లుగా భూ పరిహారం కోసం 74 ఏళ్ల వృద్ధురాలు చేస్తున్నా న్యాయపోరాటం ఐఏఎస్ అధికారవర్గాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. పరిహారం సొమ్ము కోసం పడిగాపులు కాస్తున్న ఆ వృద్ధురాలికి న్యాయపోరాటం ఫలించాలని ఆశిద్దాం.
ఏడు పదుల వయసులో అలుపెరగని పోరాటం
భూపరిహారం కోసం న్యాయపోరాటం
బదిలీ అయిన ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు
మార్చి 24న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు
బదిలీ అయినా ఐఏఎస్‌లను వెంటాడుతున్న పరిహారం కేసులు


