కొండగట్టుకు మహర్దశ
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి భక్తుల వసతి కష్టాలు తీరనున్నాయి. భక్తుల వసతి సముదాయ నిర్మాణంతో స్వామివారి సన్నిధిలో నిద్రించాలనుకునే భక్తుల కోరిక తీరనుంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో టీటీడీ బోర్డు రూ.35.19 కోట్ల కేటాయింపుతో వసతి గదులు అందుబాటులోకి రానున్నాయి.
96 గదులు..
టీటీడీ నిధులతో నిర్మించనున్న 96 గదుల భవన సముదాయంతోపాటు రెండువేల మంది దీక్షాపరులు ఒకేసారి మాలవిమరణ చేపట్టేలా మంటపాన్ని నిర్మించనున్నారు. ఘాట్‌రోడ్డు వెంటే నిర్మాణాలు చేపట్టనున్నారు. దీంతో కొండగట్టుకు వచ్చే లక్షలాదిమంది దీక్షాపరుల సమస్యలు తీరనున్నాయి.
షెడ్ల నిర్మాణంతో ఉపశమనం
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో 11 రోజులు, 21 రోజులు నిద్రిస్తే శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని, సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందనే భక్తుల విశ్వాసం. కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఆలయ అధికారులు నూతనంగా రెండు షెడ్లు నిర్మాణం చేపట్టడంతో ఉపశమనం లభించింది. ఆలయ రాజగోపురానికి ఎదురుగా ఒక షెడ్డు, ఆలయ కార్యాలయం ఎదుట మరో షెడ్డు నిర్మాణంతో భక్తులకు తాత్కాలికంగా వసతి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
రూ.35.19కోట్ల టీటీడీ నిధులు
96 గదుల భవన సముదాయం
దీక్ష విరమణ మంటపం నిర్మాణం
కొండగట్టుకు మహర్దశ


