నిబంధనల పరేషాన్
కరీంనగర్ కార్పొరేషన్: జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల నిబంధనలపై అధికారిక ప్రచారం లేకపోవడంతో అభ్యర్థుల గందరగోళం రెండోరోజూ కొనసాగింది. ఏ పత్రాలు జతపరచాలో, ఫారం ఎలా పూర్తి చేయాలో తెలియక చాలా మంది గంటల కొద్దీ కార్యాలయంలో తిరుగుతూ కనిపించారు. కొంతమంది ఆర్‌వోలు సరికొత్త నిబంధనలతో పరేషాన్ చేశారు. శుక్రవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో, అధికసంఖ్యలో దాఖలయ్యే అవకాశముంది.
ఓటరు జాబితా జిరాక్స్ కావాలి
నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి, ప్రతిపాదకుల పేర్లున్న ఓటరు జాబితా జిరాక్స్ ప్రతిని కూడా జతపరచాలని కొంతమంది ఆర్‌వోలు నిబంధన పెట్టడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొత్తగా ఓటరు జాబితా జిరాక్స్ కావాలంటున్నారని, బయటకు వెళ్తే పోలీసులు మళ్లీ లోనికి రానీయడం లేదంటూ కొంతమంది కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండోరోజూ నోడ్యూ సర్టిఫికెట్ల కోసం పోటెత్తారు. కొంత మంది అభ్యర్థులు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. ఒకరిద్దరు చంటిపాపలతో వచ్చి నామినేషన్ వేశారు. బీజేపీ, ఎంఐఎం తమ పార్టీ బీ–ఫారం జారీకి సంబంధించిన ఏ–ఫారాలను అందించారు.
రెండు పార్టీల నుంచి నామినేషన్
ఈ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. తమకు ఏ టికెట్ ఖరారుకాకపోవడం, ఆశించిన పార్టీలో టికెట్ వచ్చే అవకాశం తక్కువగా ఉండడం...తదితర కారణాలతో రెండేసి పార్టీల నుంచి నామినేషన్‌లు దాఖలు చేశారు. చివరినిమిషంలోనైనా బీ ఫారం ఇస్తే పార్టీ అభ్యర్థిగా పరిగణించే అవకాశం ఉండడంతో వేర్వేరు షెట్లు వేశారు.
భార్యాభర్తలు చెరో డివిజన్‌లో
మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి 47వ డివిజన్ నుంచి, ఆమె భర్త బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ 21వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 57వ డివిజన్ నుంచి దుడ్డెల మంజుల, ఆమె భర్త దుడ్డెల శ్రీధర్ 58 డివిజన్ నుంచి నామినేషన్ వేశారు.
హెల్ప్‌డెస్క్‌లో సందేహాలు నివృత్తి
అభ్యర్థుల సందేహాలను హెల్ప్‌డెస్క్‌లో నివృత్తి చే యాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువా రం నగరపాలకసంస్థలోని నామినేషన్‌కేంద్రాలను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి సందర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని ఈ సందర్భంగా ఆదేశించారు.
రెండో రోజు నామినేషన్లు
● కరీంనగర్‌లో రెండోరోజు 268 మంది అభ్యర్థులు 335 సెట్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి అత్యధికంగా 137 నామినేషన్ సెట్లు, కాంగ్రెస్ నుంచి 115, బీఆర్‌ఎస్ నుంచి 74, ఎంఐఎం నుంచి 26, బీఎస్‌పీ, ఆప్,సీపీఎంల నుంచి ఒక్కోటి, ఇతరులు, స్వతంత్రులు 60 నామినేషన్ షెట్లు దాఖలు చేశారు.
● హుజూరాబాద్: హుజూరాబాద్‌లో రెండో రోజు 78 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాద్ అహ్మద్ తెలిపారు. మొత్తం 93 దాఖలయ్యాయని వివరించారు.
● చొప్పదండి: చొప్పదండిలో రెండోరోజు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 8, బీఆర్‌ఎస్ నుంచి 7, కాంగ్రెస్ నుంచి 5 దాఖలు కాగా ముగ్గురు ఇండిపెండెంట్‌గా, ఏఐఎఫ్‌బీ, జనసేన నుండి ఒక్కో నామినేషన్ దాఖలైంది. అత్యధికంగా 8, 13 వార్డులకు 4 చొప్పున నామినేషన్లు వేశారు.
● జమ్మికుంట: జమ్మికుంటలో 88 నామినేషన్లు వేశారని కమిషనర్ ఎండీ అయాజ్ తెలిపారు. బీజేపీ 29, బీఎస్‌పీ 1, కాంగ్రెస్28, బీఆర్‌ఎస్ 21, ఇతర పార్టీలు6, స్వతంత్ర అభ్యర్థులు14 నామినేషన్లు వేశారని, ఇప్పటి వరకు 99 వచ్చాయని తెలిపారు.


