వరి.. రైతన్నకు సిరి
బోనస్ పడేనా?
కరీంనగర్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మిల్లులకు చేరింది. వానాకాలం సీజన్‌కు గానూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా ఎన్నడూ లేని విధంగా సేకరణ జరిగింది. ప్రాజెక్టులకు నీరు చేరడం, చెరువులు, కుంటలు కళకళలాడటం ఇది ఐదోసారి. ఈ క్రమంలో దిగుబడి గణనీయంగా పెరిగిందని గణాంకాలు చాటుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడిన ఉమ్మడి కరీంనగర్ తాజాగా వానాకాలం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే టాప్–3లో నిలిచింది. యుద్ధప్రతిపాదికన కొనుగోళ్లు జరిగా యి. ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. అక్టోబర్ చివర్లో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. గత డిసెంబర్ 15వరకు వరకు రైతుల నుంచి సేకరణ చేశామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.
82187 మంది రైతులు.. 3.32లక్షల మెట్రిక్ టన్నులు
జిల్లాలో మొత్తం 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ, ప్యాక్స్, డీసీఎంఎస్, మెప్మా, హాకాలు కొనుగోళ్లు నిర్వహించాయి. 82187మంది రైతులు కేంద్రాల్లో విక్రయించారు. అధికారులు 3.32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో రైతుల వివరాలను నమోదు చేసి, వారి ఖాతాలకు నగదును చేర్చారు.
ఇతర జిల్లాల నుంచి ధాన్యం
జిల్లాలో ధాన్యం దిగుబడులు ముంచెత్తగా రైస్ మిల్లులు నిండిపోయాయి. మూతబడిన మిల్లులు కూడా తెరచుకోవడం మిల్లుల ప్రాధాన్యతను చాటుతోంది. పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో మిల్లులు ధాన్యంతో నిండిపోవడంతో కరీంనగర్ జిల్లాలోని మిల్లులకు కేటాయించారు. దీంతో పాటు ఇతర జిల్లాల ధాన్యం కరీంనగర్ మిల్లులకు తరలిస్తున్నారు. కరీంనగర్, జమ్మికుంట, మానకొండూర్, తిమ్మాపూర్, చొప్పదండి, గంగాధర, శంకరపట్నం, హుజూరాబాద్, గన్నేరువరం, చిగురుమామిడి తదితర ప్రాంతాల్లో రైస్‌మిల్లులున్నాయి. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాకు కేటాయించినట్లు సమాచారం. నిర్మల్, ఖమ్మం, మంచిర్యాల, వరంగల్ అర్బన్, జగిత్యాల జిల్లాల నుంచి సైతం ఇక్కడికి ధాన్యం తరలించారు.
జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు: 322
కొనుగోళ్ల అంచనా: 3,01,880మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేసింది: 3,32,809
మొత్తం రైతులు: 82,187
మొత్తం ధాన్యం విలువ: రూ.788.73కోట్లు
గత యాసంగిలో సన్న రకాలకు బోనస్ పడకపోగా 61వేల వేలమంది రైతులు నిరీక్షిస్తున్నారు. సుమారు రూ.50కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ.. నేటికీ స్పష్టత లేదు. కేవలం వానాకాలం సీజన్ బోనస్ మాత్రమే రైతుల ఖాతాకు చేరుతోంది. అదీ కూడా పక్షం, నెల రోజులకు పడుతుండగా కొందరి ఖాతాలో జమకాలేదని సమాచారం.


