ఓటు ఇక్కడ.. బూత్ అక్కడ
ఓటు ముకరంపురలో.. పోలింగ్ బూత్ షాషామహల్‌లో..
ఒక్క డివిజన్‌లోనే 66 పోలింగ్‌బూత్‌ల ఓట్లు
ముసాయిదాలో చిత్ర విచిత్రాలు
ఒక్క డివిజన్‌లోనే 66 పోలింగ్ బూత్‌ల ఓట్లు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ రూపొందించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డివిజన్ల పునర్విభజన జాబితా, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటినంబర్లు, పోలింగ్ బూత్‌ల ప్రకారం 66 డివిజన్ల ఓటర్ల జాబితాను రూపొందించినట్లుఽ అధి కారులు చెబుతున్నారు. ముసాయిదా జాబితాను పరిశీలిస్తే ఆ పద్ధతి కనిపించడం లేదు. 66 డివిజన్ల జాబితాలను చూస్తే, ఎక్కడా ఒక ఇంటినంబర్ ఓట్లు ఒకేచోట కనిపించడం లేదు. ఇంటినంబర్‌కు సంబంధించిన ఒక ఓటు ఒక పేజీలో, మరో ఓటు మరో పేజీలో, ఇంకో ఓటు ఎక్కడో కనిపిస్తున్నాయి. దీంతో తమ ఓట్లు మొత్తం తమ ఇంట్లో ఉన్నాయో లేవో తెలియని గందరగోళ పరిస్థితిలో ఓటర్లు తలలు పట్టుకొంటున్నారు. పోలింగ్‌బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలను తీసుకొని, సంబంధిత డివిజన్‌లో జతపరచారని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సాధారణంగా ఏ డివిజన్‌లోనైనా నాలుగు నుంచి ఆరు పోలింగ్ బూత్‌లు ఉంటాయి. కొన్ని డివిజన్‌లలో తొమ్మిది ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఒక్కో డివిజన్‌లో 30 నుంచి 66 పోలింగ్ బూత్‌లు కూడా ఉండడం గమనార్హం. నగరపాలకసంస్థ 47వ డివిజన్‌లో అసెంబ్లీ ఎన్నికల వారిగా చూస్తే తొమ్మిది పోలింగ్ బూత్‌లు ఉండాలి. కాని ఈ డివిజన్‌లో ఏకంగా 66 పోలింగ్ బూత్‌లకు సం బంధించిన ఓట్లు ఉన్నాయంటే, జాబితా ఎంత గందరగోళంగా ఉందో ఊహించొచ్చు. ఈ డివిజన్‌లో కొన్ని పోలింగ్ బూత్‌ల నుంచి ఒక్క ఓటు మాత్రమే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దాదాపు అన్ని డివిజన్‌లలో పోలింగ్ బూత్‌ల సంఖ్య గతానికి భిన్నంగా అధికసంఖ్యలో ఉన్నాయి. 64వ డివిజన్ ముకరంపురలో పొందుపరిచిన ఓటు పోలింగ్‌బూత్ మాత్రం కమాన్ సమీపంలోని షాషామహాల్ వద్ద చూపిస్తోంది. దీనితో ఆ ఓటరు ముకరంపురలో ఓటు వేయాలా, షాషామహల్‌లో ఓటు వేయాలో తెలియని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒకటి, రెండు కాకుండా వేలాది ఓట్లు ఈ రకంగానే ఉండడంతో, వీటిని సరిచేస్తారా, అలానే వదిలేస్తారో అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముసాయిదా జాబితాను ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప, జాబితా గాడినపడే అవకాశం లేదు.
ఓటు ఇక్కడ.. బూత్ అక్కడ


