యువతకు స్కూటీ.. జాడ లేదేమి?
కరీంనగర్‌స్పోర్ట్స్: ప్రభుత్వ పాఠశాలల విద్యావ్యవస్థను కాంగ్రెస్ పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్ హౌసింగ్‌బోర్డు కాలనీలోని సరస్వతి శిశుమందిర్‌లో ఖేల్‌ఖూద్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ విద్యార్ధికి రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని మోసం చేసిందన్నారు. నాలుగేళ్లుగా దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారని మరిచారన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు టెన్త్ పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ చేస్తే రూ.25 వేలు, పీజీ చేస్తే రూ.లక్ష ఇస్తామని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఇవ్వాలని అడిగిన పాపానికి అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశుమందిర్ అని కేంద్రమంత్రి కొనియాడారు. ఇదే స్కూల్‌లో తాను చదువుకొని కేంద్ర మంత్రి వరకు ఎదగడం గర్వంగా ఉందన్నారు. సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మం వంటి అంశాలు ఇక్కడే నేర్చుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆర్మీలో చేరి.. దేశానికి సేవ చేసేలా తయారు కావాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించడంతోపాటు ల్యాప్‌టాప్ సహా ఇతర సౌకర్యాలన్నీ కల్పించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. శిశుమందిర్ లో చదువుకున్న ఎందరో అధికారులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, రాజకీయ నేతలుగా ఎదిగారన్నారు. అనంతరం కేంద్ర మంత్రి విద్యార్థులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు.
యువతకు స్కూటీ.. జాడ లేదేమి?


