భూసర్వేకు తొలి అడుగు
పైలట్ ప్రాజెక్ట్‌గా కొత్తపల్లి.. నేడే రోవర్లపై శిక్షణ
1,768 సర్వే నంబర్ల సర్వేకు ప్రణాళిక
వీలైనంత త్వరగా కార్యరంగంలోకి సర్వేయర్లు
కరీంనగర్ అర్బన్: భూచిక్కుముళ్లు విప్పేందుకు ప్రభుత్వం తొలి అడుగు వేస్తోంది. గెట్ల పంచాయితీలు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదేమో. ప్రతీ గ్రామంలో హద్దుల వివాదాలు గరిష్ట సంఖ్యలో ఉండగా.. ప్రభుత్వం సమగ్ర భూసర్వేకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సర్వే జరగగా.. జిల్లాలో తొలిసారిగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. సదరు గ్రామంలో నక్ష సరిగా లేకపోగా.. చాలా సర్వే నంబర్లకు నక్షాలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు గ్రామాన్ని ఎంపిక చేయగా.. సర్వేలో కీలక పాత్ర పోషించే మూడు రోవర్లను జిల్లాకు కేటాయించింది. తెలంగాణ భూభారతి చట్టం అమలులో భాగంగా పలు సంస్కరణలు చేపట్టిన విషయం విదితమే. నిజాం కాలంలో చేపట్టిన భూసర్వే, నక్ష(మ్యాప్), నాటి రికార్డులే ఆధారంగా రెవెన్యూ కార్యకలాపాలు సాగుతున్నాయి. భూకమతాలు పెరగడం, విస్తీర్ణాలు విభజనకు నోచుకోవడంతో హద్దులు మారిపోతున్నాయి. గ్రామాల్లో భూములకు సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు బాధ్యతలు
జిల్లాలో 300 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలో కూడా పాల్గొనగా.. వీరితోనే ఎంజాయ్‌మెంట్ సర్వే చేపట్టనున్నారు. వీలైనంత త్వరగా సర్వే చేపట్టనుండగా.. అధునాతనమైన రోవర్ పరికరాలను సర్వేకు ఉపయోగించనున్నారు. పక్షం రోజుల్లో సర్వే పూర్తిచేయనున్నారు. భూవిస్తీర్ణాన్ని నెల రోజుల్లో సర్వే చేసేందుకు రూ.40వేలు, 2వేల ఎకరాలు మించితే రూ.60 వేలను సర్వేయర్లకు చెల్లించనుంది.
సర్వేతోనే భూధార్
భూభారతిలో ప్రస్తావించిన ప్రతి రైతుకూ భూధార్ నంబరు ఇచ్చే ప్రక్రియను అమలు చేయనున్నారు. చట్టం ప్రకారం మొదట ప్రతీ రైతు రికార్డులు పరిశీలించి సరిగా ఉన్నాయని భావిస్తే.. టెంపరరీ భూధార్ నంబరు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సరిహద్దులను గుర్తించి మ్యాప్ గీయనున్నారు. సర్వేయర్ పరిశీలన తర్వాత తహసీల్దార్ అమలు చేస్తారు. అప్పుడు అది సరిహద్దులు గల భూమిగా గుర్తించబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మినెంట్ భూధార్ నంబరు ఇవ్వాలని ఆర్వోఆర్–2025 స్పష్టం చేస్తోంది. ఈ రెవెన్యూ రికార్డుల వెరిఫికేషన్ జీపీవోలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతోనే పూర్తవుతుంది. కానీ రెండో ప్రక్రియ మాత్రం లైసెన్సుడ్ సర్వేయర్లు, సర్వేయర్లు, తహసీల్దార్ల విధుల్లో భాగం.
పైలట్ ప్రాజెక్ట్‌గా కొత్తపల్లి
పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రెవెన్యూ రికార్డు అందుబాటులో లేని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో రీసర్వే జరిపి దస్త్రాలను తయారు చేయనున్నారు. గురువారం కలెక్టరేట్‌లో రోవర్ పరికరాలపై శిక్షణనివ్వనున్నారు. తదుపరి వీలైనంత త్వరగా ఎంజాయ్‌మెంట్ సర్వే చేసి నక్షను రూపొందించనున్నారు. హద్దుల గొడవలు లేకుండా హద్దులను నిర్ణయించనున్నారు. గ్రామంలో 2వేల ఎకరాలకు పైగా సాగు భూములున్నాయి. ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి కొత్తగా రికార్డులు తయారు చేయనుంది. సర్వే నంబర్ వారీగా నక్ష రూపొందిస్తుంది. వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంది. అనంతరం భూధార్ నంబర్లను రైతులకు అందిస్తుంది.


