నీళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలు
పాలమూరు రంగారెడ్డి విషయంలో ఉద్యమం చేసింది బీజేపీయే
తెలంగాణకు అన్యాయం జరగొద్దని మీటింగ్‌లు పెట్టింది కేంద్రమే
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
నీటి పంపకాల విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లది రాజకీయ డ్రామానేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. నీటి పంపకాల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో మొదటి నుంచి తాను పోరాటం చేశానని అన్నారు. కరీంనగర్‌లో గురువారం మాట్లాడారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏనాడూ పోరాటం చేయలేదని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ఆరు ప్రాజెక్టులకు ఎవరూ అభ్యంతరం తెలపొద్దని ఉందని అన్నారు. ఆరు ప్రాజెక్టుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు మరణశాసనం విభజన చట్టంలోని ఈ అంశమేనని అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంపై కాంగ్రెస్ పదేళ్లు ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ.. అవినీతిపై విచారణ లేకుండా బీఆర్‌ఎస్ అసెంబ్లీ సాక్షిగా దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేసిన పాపాలు.. తెలంగాణ ప్రజలకు శాపాలయ్యాయని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్‌ఎస్ తీరుపై ఉద్యమంచేసి కేసీఆర్ మెడలు వంచింది బీజేపీయే అన్నారు. తెలంగాణకు అన్యాయం జరగొద్దని కేంద్రం అనేక మీటింగ్‌లు పెట్టిందన్నారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా వాటాలో 811 టీఎంసీలుంటే.. ఏనాడూ తెలంగాణకు 200 టీఎంసీలకు మించి నీటిని వాడుకోకుండా ఇక్కడి ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. గోదావరిలో 1,486 టీఎంసీల నీటి వాటా ఉంటే.. తెలంగాణలో ఎన్నడూ 500 టీఎంసీలకు మించి వాడుకోలేదన్నారు. ఏపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయి కృష్ణా జలాలను తాకట్టు పెట్టిండని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల వాటా రావాల్సి ఉంటే.. 299 టీఎంసీలకే ఒప్పుకుని సంతకం చేసి దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేసిన మోసగాడు కేసీఆర్ అని తెలిపారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ ‘కాళేశ్వరం’ పేరుతో కూలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి దోపిడీకి స్కెచ్ వేశారని అన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న కల్వకుంట్ల కవితకు హ్యాట్సాఫ్ అన్నా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ వై. సునీల్‌రావు పాల్గొన్నారు.


