ఎస్‌యూలో కొత్తపల్లి ఠాణా
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ నూతన భవన నిర్మాణానికి తొలి అడుగు పడింది. పదేళ్ల నిరీక్షణకు ఫలితం లభించింది. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి 15 గుంటల స్థలాన్ని కేటాయిస్తూ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (కార్యనిర్వాహక మండలి) నిర్ణయం తీసుకుంది. పోలీస్‌స్టేషన్ శాశ్వత భవన నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించగా.. అద్దె భవనంలో అరకొర వసతులతో నెట్టుకొస్తున్న పోలీసులకు ఊరట లభించనుంది. ఈ పోలీస్‌స్టేషన్ ఇటీవలే ఇన్‌స్పెక్టర్ ఎస్‌హెచ్‌ఓగా అప్ గ్రేడ్ అయింది. దీంతో పోలీసు అధికారులు, సిబ్బంది పెరిగి ఇరుకుగా మారింది. నూతన భవనం పూర్తయితే పోలీస్‌స్టేషన్ సుందరంగా కనిపించనుంది. కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్, ఎలగందుల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, నాగులమల్యాల, బ ద్దిపల్లి గ్రామాలతో పాటు కరీంనగర్‌లో విలీనమైన సీతారాంపూర్, రేకుర్తి, కొత్తపల్లి, మల్కాపూర్, చింతకుంట డివిజన్లతో కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిపాలన కొనసాగుతోంది. గ్రానైట్, ఇసుక, భూ పంచా యతీలతో బిజీగా ఉండే ఈ స్టేషన్‌కు శాశ్వత భవనం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
వర్సిటీలో 15 గుంటల స్థలం కేటాయింపు
శాతవాహన విశ్వవిద్యాలయంలో కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు 15 గుంటల స్థలం కేటాయిస్తూ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. గతంలో చింతకుంట, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్ భవనం నిర్మించాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఎట్టకేలకు గతేడాది డిసెంబర్ 24న జరిగిన 84వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. మల్కాపూర్ జంక్షన్ నుంచి చింతకుంట వెళ్లే రహదారిలో, యూనివర్సిటీ వెస్ట్ గేట్ (పడమర ద్వారం) పక్కన ఉన్న స్థలాన్ని ఈ భవన నిర్మాణం కోసం కేటాయిస్తూ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను గురువారం కరీంనగర్ సీపీ గౌస్‌ఆలంకు శాతవాహన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ యు.ఉమేశ్‌కుమార్ అందించారు. అనంతరం ఇరువురు వర్సిటీ స్థలాన్ని పరిశీలించారు. శిక్షణ ఐపీఎస్ సోహం సునీల్, శాతవాహన వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్, హరికాంత్, కంట్రోలర్ డి.సురేశ్‌కుమార్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ విజయకుమార్, సీఐ బి.కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు.


