గెలుపు గుర్రాలకే టికెట్లు! | - | Sakshi
Sakshi News home page

గెలుపు గుర్రాలకే టికెట్లు!

Jan 9 2026 7:40 AM | Updated on Jan 9 2026 7:40 AM

గెలుపు గుర్రాలకే టికెట్లు!

గెలుపు గుర్రాలకే టికెట్లు!

గెలుపు గుర్రాలకే టికెట్లు! ● ‘సీనియారిటీ’ కోటా లేనట్లే.. ● మారుతున్న పార్టీల తీరు ● బలం ఉంటేనే బల్దియా చాన్స్‌

పాత.. కొత్త.. మనోళ్లు.. పక్కోళ్లు.. ఎవరైనా ఒక్కటే. గెలిచెటట్లుంటే చాలు.. టికెట్‌ ఇచ్చుడే. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీలు ఈ దిశగా తమ తీరును మార్చుకుంటున్నాయి. పార్టీలో సీనియర్లు ఉంటే ఇతర పదవులు ఇచ్చినా సరే కాని.. అంతగా విజయావకాశాలు లేకుంటే పార్టీ టికెట్‌ ఇచ్చి రిస్క్‌ చేయలేమనే స్థితికి చేరుకున్నాయి. దీంతో డివిజన్‌లో బలం ఉంటే చాలు.. బల్దియా ఎన్నికల్లో చాన్స్‌ వెతుక్కుంటూ రానుంది.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: సర్పంచ్‌ ఎన్నికల అనంతరం పరిషత్‌ను పక్కనపెట్టి మున్సిపల్‌ ఎన్నికల వైపు ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో పార్టీలు అంచనాలకు వచ్చాయి. ఆ దిశగా సిద్ధమవుతున్నాయి. ఈనెల 12న డివిజన్లవారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు ఇప్పుడు, అప్పుడు అంటూ ఊహాగానాలు పెరిగిపోతున్నా యి. రిజర్వేషన్లకు ముందే ఆశావహులు తమ అభ్యర్థిత్వం కోసం ఆయా పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ప్రచారం మొదలుపెట్టారు.

సీనియారిటీ కోటా కష్టమే..

తాము కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఉన్నామని, తమ సీనియారిటీని గుర్తించి పార్టీ టికెట్‌లు ఇవ్వాలంటూ కొంతమంది నాయకులు ఆయా పార్టీల నేతలతో వాదిస్తుంటారు. కాని మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భావిస్తున్న పార్టీలు ఈసారి సీనియారిటీ కోటాపై అంతగా ఆసక్తి చూపడం లేదు. సీనియర్‌ అయినా.. జూనియర్‌ అయినా.. పక్క పార్టీల వాళ్లయినా.. గెలిచే అవకాశాలుంటేనే టికెట్‌ ఇవ్వాలని బలంగా నిర్ణయించుకున్నాయి. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సత్యం ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. గెలిచే అవకాశాలున్న వాళ్లకే టికెట్‌ ఇస్తామని, ఇతర పార్టీల్లో ఉండి కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆస క్తి చూపితే వారికి కూడా చాన్స్‌ ఉంటుందన్నారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వెల్ల డించినట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌ సైతం ఇదే తీరున గెలుపు గుర్రాలకే చాన్స్‌ ఇస్తామని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ నేత, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ గత ఎన్నికల్లోనే ఈ ఫార్ములా పాటించారు. దీంతో సీనియార్టీ కోటా కాకుండా.. గెలుపు అవకాశాలు మెరుగుపరుచుకుంటేనే మేలని ఆశావహులు ఉసూరుమంటున్నారు.

సర్వేలే ప్రామాణికం

ఆయా డివిజన్లలో బలం ఉన్న, విజయావకాశాలు మెరుగ్గా ఉన్న నాయకులకే టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ సమాయత్తమవుతున్నాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపగల ఎంఐఎం సైతం గెలుపు అవకాశాలున్న నాయకులకే చాన్స్‌ ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. ఇందుకోసం ఆయా పార్టీలు డివి జన్లవారీగా సర్వేలపై ఆధారపడనున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్‌ నుంచి సమాచారం తెప్పించుకుంటుండగా.. డివిజన్‌కు ఆరు పేర్లతో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను ఇవ్వాలని పీసీసీ ఇప్పటికే కోరింది. బీజేపీ డివిజన్‌ల వారీగా సర్వేలు చేయనుంది. ఇక బీఆర్‌ఎస్‌ నేత గంగుల గత మున్సిపల్‌ ఎన్నికల్లోనే ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులు, ఇతర సంస్థలతో సర్వే చేయించి టికెట్‌ ఇచ్చారు. ఈసారి కూడా డివిజన్‌ల వారీగా సర్వే చేసి మెరుగ్గా ఉన్న నాయకులకే చాన్స్‌ ఇవ్వనున్నారు.

బలం పెంచుకుంటేనే మేలు

డివిజన్‌లో బలం ఉంటేనే పార్టీ టికెట్‌ వచ్చే అవకాశం ఉండడంతో.. ఆశావహులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఆయా డివిజన్లలో ఉన్న పెద్దలు, కాలనీ కమిటీలను కలిసి తమను ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు. మాజీ కార్పొరేటర్లయితే తాము గతంలో చేసిన పనులను గుర్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement