టైగర్ ఎక్కడ?
కరీంనగర్‌రూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి జాడ కోసం ప్రత్యేక అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. బుధవారం కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో పులి పాదముద్రలను పరిశీలించారు. కవ్వాల్ రిజర్వు ఫారెస్ట్‌లో పులులను పట్టుకునే మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు చెందిన యానిమల్ ట్రాకర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన త్రిసభ్య కమిటీ సభ్యులతోపాటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ఆరు బృందాల అధికారులతో పులి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
బహుదూర్‌ఖాన్‌పేటలో వెలుగులోకి..
కరీంనగర్ మండలం బహుదూర్‌ఖాన్‌పేట శివారులో గత నెల 29న మొదటిసారిగా పులి పాదాల గుర్తులు కనిపించాయి. మరుసటి రోజున చొప్పదండి మండలం ఆర్నకొండ, జూబ్లీనగర్‌లో మగ పులి సంచరించినట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పెద్ద పులిని పట్టుకునేందుకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ప్రత్యేకంగా ఆరు బృందాలతోపాటు చెన్నూర్‌కు చెందిన యానిమల్ ట్రాకర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 3 నుంచి అధికారుల బృందం పులి కోసం చేపట్టిన అన్వేషణ బుధవారం సైతం కొనసాగింది. ముందుగా డిసెంబరు 28న అర్ధరాత్రి కరీంనగర్ మండలం జూబ్లీనగర్ నుంచి చామనపల్లి మీదుగా పులి బహుదూర్‌ఖాన్‌పేట, చొప్పదండి మండలం వెదురుగట్ట ప్రాంతానికి వెళ్లినట్లుగా పాదముద్రల ఆధారంగా ట్రాకర్స్ గుర్తించారు. జూబ్లీనగర్ గుట్ట సమీపంలోని చెరువులో పులి నీళ్లు తాగిన అనంతరం గేదైపె దాడి చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు.
సరిహద్దుల్లో అన్వేషణ
కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన వెదురుగట్ట, బహుదూర్‌ఖాన్‌పేట, సుల్తానాపూర్, ఎలిగేడు ప్రాంతాల్లో 2 రోజుల నుంచి పులి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో లభించిన పులి పాదముద్రలను ట్రాకర్స్ గుర్తించి ఎలిగేడు వరకు పులి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి పాదముద్రలు కన్పించకపోవడంతో పులి ఎటువైపు వెళ్లిందో తెలియని పరిస్ధితి నెలకొంది. పులిని పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కరీంనగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షౌకత్ హుస్సేన్ తెలిపారు.
భయాందోళనలో రైతులు
పెద్ద పులి సంచరిస్తోందనే సమాచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం వరి నాట్లు వేసే సమయం కావడంతో కూలీలు నాట్లు వేసేందుకు రాక పనులకు ఆటంకమేర్పడుతోందని వాపోతున్నారు.


