కలెక్టర్ గారు.. ఇలాగేనా జాబితా
కరీంనగర్ కార్పొరేషన్: కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్న నగరపాలకసంస్థ ఓటర్ల ముసాయిదా జాబితా ఇంత అస్తవ్యస్తంగా తయారు చేయడమేమిటని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎంత ముసాయిదా జాబితా అయినా ఇంత అధ్వానంగా ఎప్పుడు లేదని మండిపడ్డారు. శనివారం నగరంలో మాట్లాడుతూ.. అసలు ఏ విధానాన్ని అనుసరించి ఓటర్ల జాబితా రూపొందించారో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరంలోనే అత్యధిక ఓట్లున్న 7వ డివిజన్ హౌసింగ్‌బోర్డుకాలనీలో 1200 ఓట్లు వేరే ప్రాంతానివి చేర్చారన్నారు. మొగిలిపాలం, ఇల్లంతకుంట, బెజ్జంకి, బొమ్మకల్ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 64వ డివిజన్ ముకరంపురలో 4,514 ఓట్లకు గాను 722 ఓట్లు డివిజన్‌కు సంబంధం లేనివన్నారు. ఇంత దారుణంగా ఎప్పుడు ముసాయిదా జాబితా కూడా లేదన్నారు. ఓట్లు తారుమారు వల్ల రిజర్వేషన్‌లు కూడా మారిపోతాయన్నారు. ఈ జాబితాతోనే ఎన్నికలు వెళ్తారో కలెక్టర్ చెప్పాలన్నారు. మొత్తం తప్పులు సరిచేయాల్సిందేనని డిమాండ్ చేశారు.


