బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధం
కరీంనగర్‌క్రైం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు, బహిరంగంగా మద్యం సేవిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. డీజేలు, డ్రోన్ల వినియోగంపై 31 వరకు నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత ఏసీపీలు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు.
ఆదాయం పెంచుకోవాలి
కరీంనగర్‌రూరల్: గ్రామ పంచాయతీ ఆదా యం పెంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్ అన్నారు. శనివారం కరీంనగర్ మండలం నగునూరు జీపీ కార్యాలయాన్ని డీపీవో జగదీశ్, తహసీల్దార్ రాజేశ్ సందర్శించారు. గ్రామ పంచాయతీ ఆదాయ వివరాలను డీపీవో అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీపీవో, తహసీల్దార్‌ను సర్పంచ్ సాయిల్ల శ్రావణి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు సన్మానించారు. ఎంపీడీవో సంజీవరావు, ఎంపీవో జగన్మోహన్‌రెడ్డి, కార్యదర్శి లచ్చయ్య, ఆర్‌ఐ కనకరాజు, ఉపసర్పంచ్ బోనగిరి హన్మంతరావు, వార్డు సభ్యులు దామరపల్లి దామోదర్ రెడ్డి, అర్జున్, సుమన్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 22న గురుకులం ప్రవేశ పరీక్ష
విద్యానగర్(కరీంనగర్): సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్య సంవత్సరానికిగాను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశం కోసం వచ్చేనెల 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని కరీంనగర్ జిల్లా సమన్వయ అధికారి ఎ.లక్ష్మి తెలిపారు. పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తిగల విద్యార్థులు కులం, ఆధార్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో ఈనెల 21 వరకు ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించారు.
ఎస్‌యూ రిజిస్ట్రార్‌గా సతీశ్ కుమార్
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ పెద్దపల్లి సతీశ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం వీసీ ఉమేశ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా ఉన్న జాస్తి రవికుమార్ వన్ ఇయర్ లీన్ పీరియడ్‌పై కొనసాగారు. లీన్ పీరియడ్ పూర్తి కావడంతో తిరిగి ఉస్మానియా వర్సిటికి వెళ్లారు. సతీశ్‌కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగం అధిపతిగా, పరీక్షల విభాగం కాన్ఫిడెన్షియల్ కంట్రోలర్‌గా కొనసాగారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డీఎఫ్‌వో ఫీడర్ పరిధిలోని డీఎఫ్‌వో చౌరస్తా, సీఎంఆర్ షాపింగ్‌మాల్, న్యూ అపెక్స్ హాస్పిటల్, సవరన్ స్ట్రీట్, హజ్మత్‌పుర ప్రాంతాలతో పాటు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.అంబేడ్కర్‌నగర్ ఫీడర్ పరిధిలోని అంబేద్కర్‌నగర్, శివాజీనగర్, కిసాన్‌నగర్, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధం


