ఇదీ.. బాలానగర్‌కాలనీ
బాలానగర్‌లోని చర్చి
బాలానగర్‌లోని విశాలమైన రోడ్లు
వేములవాడరూరల్: తాటి కమ్మలు.. ఈత ఆకులు.. పూరి గుడిసెలు.. ఇది ఐదు దశాబ్దాల క్రితం బాలానగర్‌కాలనీలో పరిస్థితి. కానీ నేడు అధునాతన బంగ్లాలు.. కార్లు.. హైస్పీడ్ బైక్స్.. నేటి దృశ్యాలు. యాభై ఏళ్లలో వలసల ఊరు అద్భుతంగా అభివృద్ధి చెందింది. కష్టాన్ని నమ్ముకున్న పల్లెప్రజలు ఒక్కో రూపాయి కూడబెట్టి ఆర్థికంగా బలోపేతం అయ్యారు. నాడు తాటికమ్మల గుడిసెల్లో కాలం వెల్లదీసిన వారు.. నేడు జూబ్లిహిల్స్.. బంజారాహిల్స్‌లను తలదన్నేలా భవంతులు నిర్మించుకున్నారు. జీవనశైలిలోనూ మార్పులు వచ్చాయి. పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేస్తుండగా.. పెద్దలు వ్యవసాయాన్ని నమ్ముకొని ఊరిపట్టున ఉంటున్నారు. వలస ప్రజలతో ఏర్పడ్డ బాలానగర్‌కాలనీ ఉరఫ్ గుంటూరుపల్లి గురించి తెలుసుకుందాం.
1970లో మొదలైన వలసలు
ఇప్పటి రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతానికి 1970 సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నుంచి ఆరు కుటుంబాలు వలస వచ్చాయి. పత్తిపంటను ఈ ప్రాంతానికి వీరే పరిచయం చేశారు. ఆ సమయంలో వీరికి వేములవాడ శివారు ప్రాంతంలో మల్లయ్య అనే ఫాదర్ దాదాపు 15 ఎకరాలలో నివాసాలకు అవకాశం కల్పించారు. అలా మొదలైన బాలానగర్‌కాలనీ ఏర్పాటైంది. ఆరు కుటుంబాలతో మొదలైన కాలనీ నేడు 105 కుటుంబాలకు చేరింది. ప్రస్తుతం ఈ ఊరిలో 350 ఓటర్లతో 70 నివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్నారు. గుంటూరు నుంచి వలస రావడంతో గుంటూరుకాలనీ అనే మరో పేరు కూడా ఉంది. మున్సిపాలిటీలో 15వ వార్డుగా గుర్తించారు. విశాలమైన ఇళ్లు నిర్మించుకున్నారు. ఒక్కో కుటుంబం ఇంటి కోసం 15 నుంచి 20 గుంటల స్థలాన్ని ఉంచుకుంటున్నారు. ఇందులోనే అన్ని సౌకర్యాలతో ఇళ్లను కట్టుకుంటున్నారు. కాలనీలో అన్ని సీసీరోడ్లు కనిపిస్తాయి. క్యాథలిక్ చర్చిని నిర్మించుకున్నారు.
పంటల సాగులో ఆదర్శం
బాలానగర్‌కాలనీ(గుంటురుకాలనీ) ప్రజలు పత్తి, పచ్చిమిచ్చి సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా సరికొత్త పంటలు పండిస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. అన్నింటికి ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీరోడ్లు, చర్చి, వాటర్ ట్యాంకు, ఇతర సౌకర్యాలు వారి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నారు.
విదేశాల్లో ఉద్యోగాలు
బాలానగర్ రైతులు తమ పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. 105 కుటుంబాల్లో దాదాపు 15 మంది ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. 10 కుటుంబాల్లోని పిల్లలు హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు.
రెడ్డి సొసైటీగా అభివృద్ధి
బాలానగర్ రైతులంటేనే గతంలో గుంటూరు పల్లె అనేవారు. ప్రస్తుతం ఒకే మతానికి చెందిన వీరందరు రెడ్డి సొసైటీని ఏర్పాటు చేసుకుని వార్డులో ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. ఈ కమిటీకి ఇతర సొసైటీల నుంచి నిధులు తీసుకుని అభివృద్ధి చెందుతున్నారు.
కలిసికట్టుగా ఉంటాం
బాలానగర్ కాలనీలోని వాళ్లం ఒకే కుటుంబంగా కలిసి ఉంటాం. అందరం ఒక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్లమే. ఎప్పుడూ గొడవలు పడము. ఎవరి ఇంట్లో ఆపద వచ్చినా అందరం ముందుంటాం. కష్టసుఖాల్లో కలిసి ఉంటాం.
– మ్యాకల రాయపురెడ్డి, బాలానగర్
కష్టపడి ఎదిగాం
బాలానగర్ రైతులంటేనే గతంలో చిన్నచూపు చూసేవారు. అలాంటి కష్టకాలంలో మేము వ్యవసాయాన్ని నమ్ముకొని సొంతంగా ఎదిగాము. మా పిల్లలు కూడా మా కష్టాన్ని అర్థం చేసుకుని ఉన్నతస్థానంలో ఉండడం మాకెంతో సంతోషం. అందరం ఇప్పటికీ కలిసికట్టుగా ఉంటాం.– తుమ్మ ఎన్నారెడ్డి, బాలానగర్
గుంటూరు నుంచి వలసలు
కష్టాన్ని నమ్ముకున్నారు
పేదరికాన్ని జయించారు
శ్రీమంతులకు కేరాఫ్ గుంటూరుపల్లి
ఇదీ.. బాలానగర్‌కాలనీ
ఇదీ.. బాలానగర్‌కాలనీ
ఇదీ.. బాలానగర్‌కాలనీ


