ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక
కొడిమ్యాల(చొప్పదండి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి స్మారక టీ– 20లో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు కొడిమ్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఎర్రోజు తక్షిల్ ఎంపికయ్యాడు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 26 వరకు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జట్ల మధ్య నిర్వహించిన టోర్నమెంట్‌లో తక్షిల్ జగిత్యాల కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై న సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ భాస్కర్ అధ్యాపకులు అభినందించారు.
న్యాయం చేయాలని ఆందోళన
కరీంనగర్‌క్రైం: క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ కేసులో బాధితుడైన తమ కొడుకును కాపాడాలని కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన వంగల స్వప్న, రమణ శనివారం కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని తమ కుమారుడి నమ్మించి రమేశ్‌తో పాటు మరికొంత మంది రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశారన్నారు. ఈ విషయంలో మోసపోయిన తమ కుమారుడిని కూడా పోలీసులు జైలుకు పంపించారని తెలిపారు. రూ.11 లక్షలు చెల్లించాలని రమేశ్, పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
జీవన మార్గదర్శిని భగవద్గీత
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లోని కోట పబ్లిక్ స్కూల్, జూనియర్ కళాశాలల్లో శనివారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీత్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ఎంఏ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు విద్యాసంస్థలను సందర్శించి కోటా కుటుంబానికి తమ ఆశీర్వాదాలు అందించారు. ఈసందర్భంగా రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ, శ్రీభగవద్గీత కేవలం గ్రంథం మాత్రమే కాదని, జీవన మార్గదర్శి అని పేర్కొన్నారు. గీతలో చెప్పిన కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం విద్యార్థుల జీవితాలను సరైన దిశలో నడిపిస్తాయని, చదువుతో పాటు సంస్కారం ఎంతో అవసరం వివరించారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కోటా విద్యాసంస్థలు విద్యతో పాటు నైతిక విలువలకు పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. చైర్మన్ డి.అంజిరెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులున్నారు.
దూషించినవారిపై కేసు
పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని దూషించినవారిపై కేసు నమోదైంది. రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి మండలం మారెడుగొండ పంచాయతీ సర్పంచ్ పదవికి సిరిసెట్టి కొమురయ్య పోటీ చేసి ఓడిపోయాడు. కాగా తనకు ఓటు వేయలేదని కొమురయ్యతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన జక్కుల నాగమణిని ఇష్టారీతిన దూషించి, దాడి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.
కూలీలపై తేనెటీగల దాడి
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని రామన్నపేట గ్రామంలో శనివారం వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన తడకమడ్ల అరవింద్, అతడి తల్లి సత్తమ్మ వరినాట్లు వేసేందుకు పొలం వద్దకు వెళ్లారు. వీరితోపాటు మరికొంత మంది కూలీలు ఉన్నారు. నాట్లు వేసేందుకు సిద్ధమవుతుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో అరవింద్, సత్తమ్మ, వజ్రవ్వ, సుమన్, విక్రమ్ గాయపడ్డారు. బాధితులను 108 అంబులెన్స్‌లో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.


