కళ్లలో కారం కొట్టి యువకుడి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బుర్ర మహేందర్‌గౌడ్ (33) శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్‌గౌడ్ మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఓ మహిళను కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో ఆమె వరుసకు సోదరి అయిన లక్ష్మీపూర్‌కు చెందిన సంధ్యకు చెప్పుకుంది. శుక్రవారం ఇద్దరూ లక్ష్మీపూర్‌లో సంధ్య ఇంట్లో ఉండగా, రాత్రి మహేందర్‌గౌడ్ అక్కడికి వచ్చాడు. వారి మధ్య గొడవ కావడంతో మహేందర్ కళ్లలో కారంపొడి చల్లారు. దీంతో అతను బయటకు పరుగులు తీయడంతో అక్కడే ఉన్న సంధ్యతో పాటు, మరికొంత మంది బలమైన ఆయుధాలతో దాడిచేయడంతో మృతిచెందాడు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కాగా, హత్యలో ప్రమేయం ఉన్న వ్యక్తులు పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ తెలిపారు.
బైక్ చెట్టుకు ఢీకొని యువకుడి మృతి
జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని పెద్దాపూర్– తేలుకుంట గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన తోడేటి సాయికిరణ్(24), రోహిణికి వివాహం కాగా, 6 నెలల బాబు ఉన్నాడు. గ్రామంలో కుటుంబ కలహాలతో ఇబ్బందులు ఎదుర్కోగా, నెలరోజులుగా బంధువుల ఊరైన తేలుకుంటలో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి మోటారుకు మరమ్మతు చేయించేందుకు కొత్తూరు వెళ్లాడు. పనులు ముగించుకొని రాత్రి బైక్‌పై తేలుకుంటకు వస్తుండగా పెద్దాపూర్– తేలుకుంట గ్రామాల మధ్య మైస మ్మ ఆలయ సమీపంలో చెట్టుకు ఢీకొని దారి పక్కన పడి మృతిచెందాడు. శనివారం వేకువజామున వాకింగ్‌కు వెళ్లినవారు చూసి మృతుడి బంధువుకు సమాచారమిచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఎస్సారెస్పీ కాల్వలో పడి ఒకరు..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటకు చెందిన కీర్తి సందీప్ (35) శుక్రవారం రాత్రి ఎస్సారెస్పీ డీ–83 కాల్వలో జారిపడి మృతిచెందాడు. రూరల్ ఎస్సై మల్లేశ్ వివరాల ప్రకారం.. సందీప్ సమీపంలోని గొల్లపల్లిలో దశదిన కార్యక్రమంలో పాల్గొని మద్ది కుంటకు వస్తుండగా మార్గమధ్యలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వంతెన పైనుంచి జారి కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడు. కాలువపై వంతెన శిథిలమై ఉండడాన్ని గుర్తించని కారణంగా ఈ ఘాతుకం జరిగిందని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
కళ్లలో కారం కొట్టి యువకుడి హత్య
కళ్లలో కారం కొట్టి యువకుడి హత్య


