ధర్మపురిని నాశనం చేసింది బీఆర్‌ఎస్సే
కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2 పేరుతో 1,020 ఎకరాల రైతుల భూములు లాక్కొని, గిరిజనులు, ఒడ్డెర జాతి ప్రజలను బెదిరించి ధర్మపురి నియోజకవర్గాన్ని నాశనం చేసిన ఘనత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. 2016లో జీవో నంబరు 71 ప్రకారం ప్రారంభించిన ప్రాజెక్టును ఆరేళ్లపాటు కొనసాగించి, పూర్తి చేయకుండానే అంచనాలను రూ.66కోట్ల నుంచి రూ.136 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా అప్పటి కాంట్రాక్టర్‌తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఇదేనా బీఆర్‌ఎస్ పాలకుల అభివృద్ధి మోడల్ అని ప్రశ్నించారు. ధర్మపురిని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయని, 146 గ్రామాలకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక్కసారి కూడా ఈ అంశంపై ప్రశ్నించలేదని విమర్శించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరు నెలల్లోనే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నానని అన్నారు. 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి పంపించి, రూ.7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు. తను రాజీనామా చేయాలా వద్దా అనేది నిర్ణయించేది ధర్మపురి ప్రజలేనని... బీఆర్‌ఎస్ నేతలు కాదని స్పష్టం చేశారు. మరో మూడు సంవత్సరాల్లో తాను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.


