దగ్గు.. జలుబు.. జ్వరం
ఓపీ ఎక్కువ.. ఐపీ తక్కువ
● ఆసుపత్రులకు బాధితుల వరుస ● చలి ప్రభావమే అంటున్న డాక్టర్లు
చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట చలి, పొద్దంతా ఎండ అన్నట్లు వాతావరణంలో విచిత్రమైన మార్పులు జరుగుతున్నాయి. జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో వ్యాధులు పంజా విసురుతున్నాయి. జలుబుతో కూడిన దగ్గు, జ్వరంతో తిప్పలు పడుతున్నారు. రెండు, మూడు రోజులు సొంత చికిత్సకే పరిమితమై తగ్గకపోవడంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.
కరీంనగర్: 2 వారాలుగా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వ ప్రధానాసుపత్రి వైద్యులు చెబుతున్నారు. అన్‌సీజన్ లాగే ఉన్నా.. ప్రతిరోజు 700 నుంచి 900 వరకు ఔట్ పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో 50 శాతం జలుబుతో కూడిన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారే ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో కూడా పెద్దల కంటే పిల్లలే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పిల్లల ఆసుపత్రులతోపాటు జనరల్ ఫిజీషియన్ల వద్ద పేషెంట్లు వరుస కడుతున్నారు.
ఇబ్బంది పెడుతోంది..
ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలో జ్వరాలు సాధారణ స్థితిలోనే ఉంటున్నాయని ప్రభుత్వాసుపత్రి జనరల్ ఫిజీషియన్ వైద్యులు చెబుతున్నారు. జలుబుతో కూడిన దగ్గు, జ్వరాల కేసులే ఎక్కువగా వస్తున్నాయని, ఒకటి, రెండు రోజుల్లోనే కోలుకుంటున్నారని చెబుతున్నారు. జీజీహెచ్‌లో ఓపీ మాత్రమే ఎక్కువగా ఉండడం, ఐపీ చాలా తక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనం. అయితే స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, ఇతరులకు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉంటే ఈ వ్యాధులు సమాజం నుంచి దూరమవుతాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
చలి తీవ్రతతో చిన్నారుల్లో దగ్గు, జలుబు సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత బాధితులే ఓపీకి ఎక్కువగా వస్తున్నారు. చిన్నారులతోపాటు వృద్ధులు, గర్భిణులు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రమాదకర పరిస్థితి ఏ ఒక్కరిలో లేకపోయినా.. ఈ వ్యాధులు వారంపాటు ఇబ్బంది కలిగిస్తున్నాయి. పిల్లలను చల్ల గాలికి తిప్పొద్దు. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగొద్దు. పాఠశాల, ఇతర పనులకు బయటకు వెళ్లేవారు ఉన్ని దుస్తులు ధరిస్తూ గాలి వెళ్లకుండా చెవులు, ముక్కు, నోటిని కప్పి ఉంచాలి.
– డాక్టర్ నవీన, జీజీహెచ్ ఆర్‌ఎంవో
దగ్గు.. జలుబు.. జ్వరం
దగ్గు.. జలుబు.. జ్వరం


