అంజన్నకు నోటీసులు!
కొండగట్టు ఆంజనేయ స్వామిపై
అటవీ శాఖ కిరికిరి
దేవాదాయ వర్సెస్ అటవీ శాఖ
ఇరు శాఖల మధ్య ఆధిపత్య పోరు
తమ భూముల్లో నిర్మాణాలపై ఫారెస్ట్ అధికారుల అభ్యంతరం
ఆలయ అభివృద్ధికి విఘాతంగా మారిన స్థలం కొరత
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో దేవాదాయ– అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. కొండగట్టు మీది ప్రాంతం మాత్రమే గుడిదని, ఇటీవల తమ భూముల్లోకి చొచ్చుకువచ్చి దాదాపు ఆరున్నర ఎకరాల భూమిని దేవాదాయశాఖ ఆక్రమించిందని అటవీశాఖ ఆరోపిస్తోంది. ఆ ఆరున్నర ఎకరాల్లో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ మార్కింగ్ చేయడంతో రెండుశాఖల మధ్య వివాదం మొదలైంది. ఈ ఆరున్నర ఎకరాల భూమి తమదంటే తమదని ఇరుశాఖలు పరస్పరం వాదించుకుంటున్నాయి. కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూములను ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుతో తాము తీసుకునే అవకాశం ఉందని దేవాదాయశాఖ అధికారులు చెబుతుండగా.. అనుమతి లేకుండా తమ భూములు ఎలా తీసుకుంటారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. మొత్తానికి అటవీశాఖ అధికారులు పెట్టిన కిరికికి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది.
వివాదం ఇదీ..
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేవాదాయశాఖ కొన్ని అభివృద్ధి పనులు చేపట్టింది. గుడి ఉన్న గట్టు ప్రాంతం మినహా కింద ఉన్న భూములు తమకే చెందుతాయని అటవీశాఖ వాదన. గట్టు కింద భక్తుల కోసం 20 గదుల వసతి భవనం, ఈవో కార్యాలయ భవనం, వాహన పూజా మండపం తదితర భవనాలు దశాబ్దకాలం క్రితం నిర్మించారు. అవన్నీ తమ పరిధిలోకి వస్తాయని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, మార్కింగ్ చేయడంతో విషయం వివాదంగా రూపుదాల్చింది. ఇది క్రమంగా రాజకీయ రంగు పులుముకునేలా కనిపిస్తోంది. కొండగట్టు ఆలయ భూములు సంరక్షించాలని, భూములను ఆలయానికి అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు.
వైజంక్షన్ వద్ద గేటు ఏర్పాటు సన్నాహాలతో..
కొండగట్టు ఆలయానికి వెళ్లే దారిలో ఘాట్‌రోడ్డు, జేఎన్టీయూ రోడ్డు కలిసే వైజంక్షన్ వద్ద అటవీశాఖ అధికారుల గేటు ఏర్పాటు సన్నాహాలు రెండు శాఖల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా చేశాయి. రెండున్నరేళ్ల క్రితం కొండగట్టు పరిసరాల్లోని అటవీభూముల్లో అర్బన్ పార్కు ప్రతిపాదనలో భాగంగా వైంజక్షన్ వద్ద గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గేటు ఏర్పాటుతో వై జంక్షన్‌కు వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందిగా మారుతుందని ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామం రెండుశాఖల మధ్య దూరం పెంచింది. కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కొరతతో ఇబ్బంది పడుతుండగా, వైజంక్షన్ సమీపంలో అటవీశాఖ గేటు ఏర్పాటు చేస్తే.. తాము వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈవో శ్రీకాంత్ రావు కూడా ఆ భూములు ఆలయానికే చెందుతాయని స్పష్టంచేస్తున్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎఫ్‌వో రవికుమార్ సమక్షంలో అటవీశాఖ, దేవాదాయశాఖ, రెవెన్యూశాఖ ముకుమ్మడిగా హద్దుల ఏర్పాటు కోసం సర్వే చేపట్టారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రెవెన్యూ భూములు బదిలీ చేశాం. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యామ్నాయంగా భూముల కేటాయింపు చేసుకునే అవకాశముంది. కలెక్టర్ ఆదేశాలతో కొండగట్టులో అటవీశాఖ, దేవాదాయశాఖ సరిహద్దుల వివాదం పరిష్కరించేందుకు సర్వే చేపట్టాం. అటవీశాఖ హద్దులు గుర్తించాం.
– పులి మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల


