
ప్రమాదకరంగా ఆర్టీసీ బస్సుల డ్రైవింగ్
హుజూరాబాద్‌రూరల్: హుజూరాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన ఘటన మంగళవారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. జమ్మికుంట బస్ స్టేషన్ నుంచి హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సులు హుజూరాబాద్ వైపు ఒకే సమయంలో బయల్దేరాయి. డ్రైవర్లు ఒకరిని మించి మరొకరు ప్రమాదకరంగా ఇతర వాహనాలు వెళ్లకుండా ఒకదానికొకటి ఓవర్ టేక్ చేస్తూ నడపటంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. వేరే వాహనాలు వెళ్లకుండా ప్రమాదకరంగా బస్సులను నడుపుతున్న వీడియోలను వెనుక వచ్చిన వాహనాదారులు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.