సాకారమైన అగస్త్య ఫుడ్స్‌ యూనిట్‌ | - | Sakshi
Sakshi News home page

సాకారమైన అగస్త్య ఫుడ్స్‌ యూనిట్‌

Aug 13 2025 5:28 AM | Updated on Aug 13 2025 5:28 AM

సాకార

సాకారమైన అగస్త్య ఫుడ్స్‌ యూనిట్‌

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ అనుబంధంగా బిస్కెట్ల తయారీ యూనిట్‌ ఏర్పాటైంది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద 50 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో భాగంగా ‘అగస్త్య ఫుడ్స్‌’ కంపెనీ ‘సూపర్‌ ఫుడ్స్‌’ యూనిట్‌ను ప్రారంభించారు. 2021 ఫిబ్రవరి 8న ఈ యూనిట్‌కు అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు శంకుస్థాపన చేయగా.. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం 130 మందికి ఉపాధి కల్పిస్తూ అగస్త్య కంపెనీ ‘సూపర్‌ ఫుడ్స్‌’ తయారు చేస్తూ ఎగుమతి చేస్తోంది. భవిష్యత్‌లో మరింత విస్తరించి, యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది.

తొలి ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌

జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను రైతులను పండిస్తారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేయాలని అప్పట్లో మంత్రి కేటీఆర్‌ భావించారు. ఈమేరకు తొలి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శ్రీకారం చుట్టారు. సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఉద్యానపంటలతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలని భావించారు. జిల్లాలో తొలి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు బిస్కెట్‌ ఉత్పత్తులను ప్రారంభించి ఎగుమతులు చేస్తోంది. పక్కనే ఎగువ మానేరు జలాశయం ఉండడంతో నీటికి ఇబ్బందులు లేకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కొనసాగేందుకు అవకాశం లభించింది.

బహుముఖ ప్రయోనాలు

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు శివారులో సర్వేనంబర్‌ 104/2, 124/2లో 282 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు రైతులకు రూ.11.73 కోట్లు పరిహారం చెల్లించి సేకరించారు. ఆ స్థలాన్ని టీఎస్‌ఐఐసీకి అప్పగించారు. ఇందులో 50 ఎకరాలను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం కేటాయించారు. మరో 232 ఎకరాలను సేకరించి వివిధ యూనిట్లకు కేటాయించారు. సిరిసిల్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్‌ పార్కులతో రైతాంగానికి బహుముఖ ప్రయోజనాలు కలుగనున్నాయి. ఆహారశుద్ధి పరిశ్రమలకు సమీకృత విధానాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రైతులు పండించిన పంటలను ఇక్కడే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి ఉంచేందుకు కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లను నెలకొల్పనున్నారు. రైతులు వరితోపాటు ఉద్యాన పంటలను సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. టమాటతోపాటు కూరగాయలు, పువ్వులు, పండ్లు వంటి వాటిని ఉత్పత్తి చేస్తే స్థానికంగా ప్రాసెస్‌ చేసి ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. టమాట ఎక్కువగా ఉత్పత్తి అయితే ఇక్కడే సాస్‌ తయారు చేసి విక్రయించవచ్చునని, పసుపు పండిస్తే స్థానికంగా పిండిగా మార్చి ఎగుమతి చేయవచ్చునని, స్థానికంగా అన్ని రకాల పంటలను రైతులు పండించేలా అవి ఇక్కడే ప్రాసెస్‌ అయి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్లతో రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించడంతోపాటు స్థానికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. జిల్లాలోని నిరుద్యోగులకు 5 వేల మందికి ఉపాధి చూపేందుకు ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

నర్మాల వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు

ప్రారంభంలోనే 130 మందికి ఉపాధి

మరింత విస్తరించనున్న సంస్థ

పారిశ్రామిక విజయగాథను ట్వీట్‌ చేసిన కేటీఆర్‌

ట్విట్టర్‌లో కేటీఆర్‌ ఆనందం

తెలంగాణ గ్రామీణ ప్రాంతమైన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఒక పారిశ్రామిక విజయగాథను మీతో పంచుకోవడం నాకు ఆనందంగా ఉందని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదలకు అపారమైన అవకాశాలున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం ఒక ఆశాజనకమైందన్నారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ‘అగస్త్య ఫుడ్స్‌’ పేరిట ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఎగుమతి నాణ్యత కలిగిన ‘సూపర్‌ ఫుడ్స్‌’ తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేశారు. 130 మందికి ఉపాధి కల్పిస్తూ అనేక దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు అంటూ... కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సాకారమైన అగస్త్య ఫుడ్స్‌ యూనిట్‌1
1/1

సాకారమైన అగస్త్య ఫుడ్స్‌ యూనిట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement