మానవతా దృక్పథంతో సేవలందించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
హుజూరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, వార్డులు, ఓపీ విభాగం, నవజాత శిశువుల వార్డును పరిశీలించి శిశువుల సమస్యల గురించి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. తల్లిపాల ప్రాముఖ్యత, సాధారణ ప్రసవం ప్రాధాన్యం వివరించారు. అనంతరం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో అన్ని రకాల సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది ఖాళీల వివరాలు సమర్పించాలన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ క్యాంపును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మెప్మా, ఐకేపీ సిబ్బంది ద్వారా ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షల పట్ల మహిళలకు అవగాహన కల్పించి క్యాంపును సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ క్యాంప్ ద్వారా సుమారు రూ.50 వేలు ఖరీదు చేసే 47 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్న విషయం మహిళల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు ఆస్పత్రి ఆవరణలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మొక్కలు నాటారు. సూపరింటెండెంట్ నారా యణరెడ్డి, ఆర్‌ఎంవో రమేశ్ పాలొన్నారు.
ఏఎన్‌ఎం పోస్టులకు దరఖాస్తులు
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని టేకుర్తి, కొత్తపల్లి మండలంలోని ఎలగందల్, వీణవంక మండలంలోని గన్ముక్ల మోడల్ స్కూల్ గల్స్ హాస్టల్‌లోఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన మహిళా అభ్యర్థుల నుంచి ఈనెల 6వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి శ్రీరాంమొండయ్య తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ప్రభుత్వ ఆమోదం పొందిన ఇనిస్టిట్యూషన్స్‌లో ఏఎన్‌ఎం శిక్షణ పొందిన కరీంనగర్ జిల్లావాసులు అర్హులన్నారు. ఆయా మండలాల వారికి తొలిప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆసక్తి గలవారు కరీంనగర్‌లోని జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో బయోడేటాను సమర్పించాలని ఆయన సూచించారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ పనుల్లో భాగంగా గురువారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ రామచంద్రాపూర్ ఫీడర్‌లో ఏవోఎస్ కాలనీ, సప్తగిరికాలనీ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొత్తపల్లి (హెచ్), రాణిపూర్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ జి.రాజు వివరించారు.
మానవతా దృక్పథంతో సేవలందించాలి


