ఎముకలు కొరికే చలిలోనూ అలర్ట్
ఇల్లంతకుంట(మానకొండూర్): కార్గిల్ యుద్ధం జరిగిన రోజుల్లో కంటిమీద కునుకు ఉండేది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎముకలు కొరికే చలిలోనూ అలర్ట్‌గా ఉండేవాళ్లమంటున్నాడు ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆర్మీలో పనిచేసిన కాలంలో తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు.
1985లో ఆర్మీలోకి..
నేను 1985లో ఆర్మీలో చేరాను. 1999 మేలో ప్రారంభమైన కార్గిల్ యుద్ధంలో (ఆపరేషన్ విజయ్)లో పాల్గొన్నాను. పది మంది సైనికులతో కూడిన జట్టు మాది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎముకలు కొరికే చలినీ సైతం లెక్కచేయకుండా ఎప్పుడు అలర్ట్‌గా ఉండేవాళ్ళం. రేడియోలో వార్తలు మాత్రమే వినేవాళ్లం. ఇంటికి మాట్లాడుదామంటే ఫోన్ సౌకర్యం ఉండేది కాదు. యుద్ధ ప్రాంతానికి వెళ్తుంటే కార్గిల్ పరిసర ప్రాంత ప్రజలు మంగళహారతులతో వీరతిలకం దిద్ది పంపేవారు. యుద్ధ సమయంలో మా ధ్యాస శత్రు సైనికులపైనే ఉండేది. ఎయిర్ డిఫెన్స్‌కు సంబంధించిన బీఎంపీ యుద్ధ ట్యాంకుల వద్ద పనిచేశాను. ప్రస్తుతం రైల్వే డిపార్ట్‌మెంట్‌లో కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. భార్య ఉషారాణి, కూతుళ్లు తేజస్వినిరెడ్డి, సింధూజరెడ్డి.
కార్గిల్‌యుద్ధంలో పాల్గొనడం అదృష్టం
రిటైర్డ్ ఆర్మీ జవాన్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి


