
భూ భారతి సదస్సులను వినియోగించుకోవాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
సైదాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. భూభారతి పైలెట్ మండలంగా సైదాపూర్ ను ఎంపిక చేశామని తెలిపారు. ఈ మేరకు మండలంలోని ఎగ్లాస్‌పూర్, రాయికల్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రైతు సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రైతుల సందేహాలు నివృత్తి చేశారు. భూ రికార్డుల్లో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసుబుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్–బీలో చేర్చిన భూములు సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర సమస్యలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ ప్రకారం అధికా రులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం చూపుతామన్నారు. సదస్సులో ఏఎంసీ చైర్మన్ సుధాకర్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్లు శ్రీనివాస్, కనకయ్య పాల్గొన్నారు.
శిశుగృహ నుంచి శిశువు దత్తత
కరీంనగర్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పరిధిలోని కరీంనగర్ శిశుగృహలో పెరుగుతున్న ఐదు నెలల ఆడ శిశువును కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా హైదరాబాద్ పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. చైల్డ్‌కేర్ ఇనిస్టిట్యూట్‌లో పెరుగుతున్న 13ఏళ్ల బాలుడిని కరీంనగర్‌కు చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సిడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, డీసీపీవో పర్వీన్, పీవో తిరుపతి, శిశుగృహ మేనేజర్ తేజస్విని పాల్గొన్నారు.