శిక్షణతో సైబర్ నేరాలకు చెక్
సిరిసిల్లక్రైం: సైబర్ నేరాల ఛేదనకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఎంతో దోహదపడుతాయని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. నేరాల పరిశోధనలో ఉపయోగించాల్సిన అంశాలపై కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల సిబ్బంది, అధికారులకు మంగళవారం సైబర్ నిపుణులతో సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సైబర్ నిందితులకు శిక్ష పడటంలో డిజిటల్ సాక్ష్యాధారాల సేకరణ కీలకమన్నారు. సాంకేతికత ఆధారంగా అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది, అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నేరాలకు అడ్డుకట్ట వేయాలని వివరించారు. సైబర్ నేరం జరిగినప్పుడు ఫిర్యాదు నమోదు నుంచి డిజిటల్ ఆధారాల సేకరణ, విశ్లేషణ మొదలగు అంశాలపై నిపుణులు ఇచ్చిన శిక్షణ సద్వినియోగం చేసుకొని నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసేలా ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, రాజుకుమార్, కోర్స్ కో ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ. గీతే


