సభ సక్సెస్.. మంత్రుల్లో భయం
● సమ్మక్క జాతరను తలపించిన రజతోత్సవం ● బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు ● మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్
కరీంనగర్: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ మంత్రుల్లో భయం పట్టుకుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కమలాకర్ నివాసంలో మాట్లాడుతూ.. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపాటుకు గురైందన్నారు. ప్రైవే టు పాఠశాలల యజమాన్యానికి ఆర్‌టీఏ ద్వారా మెసేజ్‌లు పంపి, సభకు బస్సులు పంపకుండా ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి భయపడకుండా బస్సులు పంపారని కృతజ్ఞతలు తెలిపా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పొంగులేటి వైఎస్సార్‌సీపీలో ఉన్నారని, సీతక్క టీడీపీలో ఉన్నారని గుర్తుచేశారు. హామీలు నెరవేర్చటంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై చేసిన పోరాటంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, రుద్రరాజు పాల్గొన్నారు.


